Thursday, February 7, 2013

ఆత్మ షట్కమ్

(ఆత్మ పఞ్చకమ్, అద్వైత మఞ్చకమ్, నిర్వాణమఞ్చకమ్)

నాహం దేహో నేన్ద్రియాణ్యన్తరఙ్గః
నాహఙ్కారః ప్రాణవర్గోన బుద్ధిః,
దారాపత్యక్షేత్ర విత్తాదిదూరః
సాక్షీ నిత్యః ప్రత్యగాత్మా శివోహమ్.
నేను ఈ శరీరమును కాను, కళ్ళు మొదలగు ఇంద్రియములూ కాను. అహం అనే అంతరంగమునూ కాను, పంచ ప్రాణములూ కాను, బుద్ధినీ కాను. ఆలు బిడ్డలు క్షేత్రము ధనార్జన నాకు దూరములు. నిత్యము, ప్రత్యక్, సాక్షి, శివస్వరూపమగు ఆత్మను నేను.
రజ్జ్వజ్ఞానాద్ భాతి రజ్జౌ యథాహిః
స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః,
అప్తోక్త్యాహి భ్రాన్తినాశేస రజ్జు
జీవో నాహం దేశికోక్త్యా శివోహమ్,
తాడు అని తెలియకపోవడం వలన తాటిలో పాము కన్పించినట్టు, స్వాత్మ భావము వలనే జీవ భావము. ఆపులైన వారు ఉన్నది తాడే కాని పాము కాదు అని చెప్తే సర్ప భ్రాంతి పోయి "తాడు" తాడుగానే కన్పించున రీతిగా నేను గురూపదేశమువలన జీవుడను కాను శివస్వరూపుమైన ఆత్మనని తెలుసుకున్నాను.
మత్తో నాన్యత్ కిఞ్చిదత్రాస్తి విశ్వం
సత్యం బాహ్యం వస్తు మాయోపక్లుప్తమ్,
ఆదర్శాన్తర్భాసమానస్య తుల్యం
మయ్యద్వైతే భాతి తస్మాచ్ఛివోహమ్.
నా కన్నా వేరు విశ్వము అనేది లేదు, బయటి వస్తువు అద్దమునందు ప్రతిబింబంగా కనపడినట్టు, సత్యమైన వస్తువేదో అది మాయచేత కప్పబడి అద్వైత రూపుడనైన నాయందు ప్రకాశించుచున్నది. అందువలన నేను శివస్వరూపుమైన ఆత్మను.
ఆభతీదం విశ్వమాత్మన్యసత్యం
సత్యజ్ఞానానన్దరూపే విమోహాత్,
నిద్రామోహాత్ స్వప్నవత్ తన్న సత్యం
శుద్ధః పూర్ణో నిత్య ఏకః శివోహమ్.
నిద్రించునప్పుడు అఙ్ఞానమువలన కలలో కన్పించిన వస్తువులు నిజమన్పించినట్టు, =సత్య ఙ్ఞాన ఆనంద రూపుడనైన నాయందు మోహము (అఙ్ఞానము) వలన ఈ జగత్తు అంతా కన్పింస్తోంది. ఇది మిథ్య, మాయయే. నేను శుద్ధుడను, పూర్ణుడను, నిత్యుడను, అంతటా నిండి ఉన్న ఆ ఒక్కటి ఐన అద్వితీయుడను, శివస్వరూపుమైన ఆత్మను.
నాహం జాతో న ప్రవృద్ధో న నష్టో
దేహస్యోక్తాః ప్రాకృతాః సర్వధర్మాః,
కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం
కారస్యైవహ్యాత్మనో మే శివోహమ్.
పుట్టుక, పెరుగుట, నష్టమగుట (మరణించుట) ఇవి ఏవీ నాకు లేవు. ఇవి అన్నీ శరీరమునకు గల ప్రకృతి ధర్మములు. చిన్మయుడనైన నాకు కర్తృత్వములు లేవు. నేను చేయవలసిన కార్యములు లేవు. ఇవి అహంకార ధర్మములు అవి నాకు లేవు. నేను శివస్వరూపుమైన ఆత్మను.
నాహం దేహో జన్మమృత్యుః కుతో మే
నాహం ప్రాణో క్షుత్పిపాసా కుతో మే,
నాహం చిత్తం శోకమోహో కుతోమే
నాహం కర్తా బన్ధమోక్షౌ కుతోమే.
నేను శరీరమును కాను, జనన మరణములు నాకెక్కడివి? నేను ప్రాణమును కాను, ఆకలి దప్పులు నాకెక్కడివి? నేను చిత్తమును కాను, శోక+ మోహములు నాకెక్కడ? నేను కర్తను కాను బంధమోక్షములు నాకెక్కడ?

*ఇతి శఙ్కరభగవత్పూజ్యపాదవిరచిత ఆత్మషట్కమ్*

జయ జయ శంకర హర హర శంకర

No comments:

Post a Comment