Wednesday, May 22, 2013

సారతత్త్వోపదేశము

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

సార తత్త్వోపదేశః

గురుబ్రహ్మ స్వయం సాక్షాత్ సేవ్యో వన్ద్యో ముముక్షిభిః
నో ద్వేహనీయ ఏవాయం కృతజ్ఞేన వివేకినా!!
            గురువు సాక్షాత్తుగ పరబ్రహ్మస్వరూపుడు, ముముక్షువులైనవారిచే సేవనీయుడు, వందనీయుడు. వివేకి, కృతజ్ఞుడు ఐన శిష్యుడు, గురువునకెన్నడూ కష్టము కలిగించడు.

యావదాయుస్త్రయో వన్ద్యో వేదాన్తో గురురీశ్వరః
మనసా కర్మణా వాచా శ్రుతేరేవైష నిశ్చయః!!
            జీవించి ఉన్ననాళ్ళు మనోవాక్కాయములతో వేదాంతములకు (ఉపనిషత్ విద్య), గురువునకు, ఈశ్వరునకు నమస్కారము చేయవలసినది. అని శ్రుతి నిశ్చయము చేసి ఉపదేశించుచున్నది.

భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం నకర్హిచిత్
అద్వైతం త్రిషులోకేషు నాద్వైతం గురుణా సహ!!
            అద్వైత భావమును ఎప్పుడూ కలిగి ఉండవలెను. కానీ ఎన్నడూ క్రియలో అద్వైత బుద్ధిని చూపవద్దు. ముల్లోకములయందూ అద్వైతబుద్ధిని ప్రదర్శించవచ్చు గానీ, ఎన్నడూ
గురువుపట్ల అద్వైత బుద్ధిని ప్రదర్శింపరాదు.

            (గురువుకి అద్వైత స్థితివల్ల తామిద్దరూ/సమస్తమూ ఒకటే అన్న భావన ఉండి ఉన్నా, శిష్యుడు ఎంత అద్వైత స్థితిలో ఉన్నా గురువు వేరు నేను వేరు కాదు అంతా ఒకటే అని అద్వైత బుద్ధి ప్రదర్శించరాదు, శరీరం ఉన్నంత వరకు శిష్యునికి గురువు వందనీయుడే)

ఇతి శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాదవిరచిత సారతత్త్వోపదేశః
ఇది శ్రీ శంకరభగవత్పూజ్యపాదులు బోధించిన సారతత్త్వోపదేశము


భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం నకర్హిచిత్

            శంకరుల అతి ముఖ్య సందేశాలలో మనం తప్పక ఆచరించాల్సిన వాటిలో ఇదీ ఒకటి, అద్వైత విమర్శకులు, అద్వైతంలో ఉన్నామనుక్కుని మాట్లాడేవారి మాటలకి శంకరులు ఏనాడో ఎలా ఉండాలో చెప్పారు.

            భావమునందు ఎల్లప్పుడూ అద్వైతాన్నే అనుష్ఠించవలెను అంత మాత్రాన శరీర ధర్మాన్ని వదలరాదు కదా, జీవనం ఉన్నంత వరకూ శరీరం ప్రకృతి పరంగా వేరుగా కనపడుతుంది దాని ధర్మాన్ని అది నిర్వర్తించాలి, ఐనా అద్వైత సిద్ధివల్ల అంతా ఒకటిగా స్థిరీకరింపబడినా, అది భావంలో ఉండాలి తప్ప క్రియారూపంలో కాదు, భావనల వల్ల క్రియాదోషం జరగరాదు. ఒకవేళ అంత పండినా గురువుయందు బుద్ధి ప్రదర్శించక గురువుని తనకన్న వేరైన అధికునిగానే ఎంచి నమస్కరించాలి.


జయ జయ శంకర హర హర శంకర - జయ జయ శంకర హర హర శంకర

Wednesday, May 15, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-11

శ్రీ గురుభ్యోన్నమః

శ్లో10!! గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి !
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితా యా
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై !!

తా: విష్ణుమూర్తికి భార్యయైన లక్ష్మిగా, బ్రహ్మదేవుని పత్నియైన సరస్వతిగా, సదాశివుని అర్ధాంగియైన అపరాజితగా, శాకంభరీదేవిగా - ఇట్లనేక రూపములతో విశ్వమాత సృష్టి, స్థితి, ప్రళయ లీలను సాగించుచున్నదో, విశ్వాత్మకుడైన పరమ పురుషుని ఏకైక ప్రియురాలికి నమోన్నమహ.

వివరణ: శంకరులు ఇక్కడ అమ్మవారిని పరబ్రహ్మమహిషిగా సాక్షాత్ జగదంబ సృష్టి స్థితి లయ కారకురాలిగా, లోకాలను పోషించే తల్లిగా కీర్తించారు. సృష్టి కర్త ఐన బ్రహ్మ గారి సృష్టించే శక్తిగా ఉన్న సరస్వతిగా, స్థితికారకుడైన విష్ణుమూర్తియొక్క రక్షించే శక్తి ఐన లక్ష్మీదేవిగా, లయ కారకుడైన చంద్ర శేఖరుని యొక్క లయ కారక శక్తి ఐన పార్వతిగా ఉన్న ముగురమ్మల మూలశక్తివి నీవు. నీకు అసాధ్యమైనది ఏదీలేదుకదమ్మా!, సృష్టి స్థితి ప్రళయాలనే ఆటలను చక్కగా నిర్వర్తించే శక్తిగా త్రిమూర్తులను ఆశ్రయించి ఉన్న తల్లివి నీవు. అమ్మా ఒకానొకనాడు క్షామం వచ్చి జనులకి తినడానికి తిండిలేక లోకాలు నీరసించిపోతే, వారి బాధలు చూసి తట్టుకోలేక శతాక్షి గా వచ్చి జనుల కష్టాలు చూసి శతాక్షి రూపంతో ఆర్ద్రత నిండిన కన్నులతో కరుణా పూరితమైన చూడ్కులతో కాపాడావు. వెంటనే ఎవరైనా అడిగారా, తపస్సు చేశారా పాప పుణ్య ఫలితాలేమిటి అని ఆలోచించక ఆకలిని తీర్చడానికి సమస్త ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు రూపంగా శాకంబరీ అన్న పేర వచ్చి జనులందరికీ అప్పటికప్పుడు తినడానికి కావలసిన పదార్థాలను సమకూర్చావు. అది కేవలం నీ మాతృత్వభావన వల్లనే కదమ్మా. నువ్వు అన్ని జగాలకీ తల్లివి కనకనే ఎవరూ అడగకపోయినా అందరికీ అమ్మగా అన్నీ ఇచ్చావు. తల్లీ! అటువంటి నీకు ముల్లోకములకూ గురుస్వరూపమైన వాని పత్నివైన నీకు ఏమి ఇవ్వగలమమ్మా! కేవలం నమస్కారము తప్ప.

సందర్భం ప్రకారం: అమ్మా నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు నిర్వర్తించే సృష్టి, స్థితి, ప్రళయం అనే ఆటలకు మూల శక్తివి నువ్వే కదా. అటువంటి దానవు బీద బ్రాహ్మణ కుటుంబానికి వారి పాపాలను హరించి, వారు నాకు ఇచ్చిన ఉసిరిక దానాన్నే గొప్ప పుణ్యంగా మలిచి వారికి కావలసిన ఐశ్వర్యాన్ని ఇవ్వలేవా తల్లీ! అమ్మా ఎవరూ అడగకపోయినా, లోకంలో జనులందరూ కరువు కాటకాలకు గురియై ఉండగా శరీరమంతా కళ్ళు చేసుకుని ప్రాణుల కష్టాలకు చలించి నీ వంటినిండా ఉన్న కళ్ళలోని ఆర్ద్రతతో ముల్లోకాల కష్టాలనూ తీర్చడానికి శాకంబరిగా అవతరించి అందరి ఆర్తినీ ఆకలినీ తీర్చావు కదా తల్లీ! మరి బీద బ్రాహ్మణ కుటుంబం అప్పుడు లోకానికి కలిగిన కష్టం వంటి కష్టంలోనే ఉన్నారు. అప్పుడు ఎవరు స్తుతించారు ఎవరు స్తుతి చేయలే, ఎవరికెంత పాపముంది, ఎవరికెంత పుణ్యముంది అని చూడకుండా నీ నిండైన అమ్మతనంతోనే కదమ్మా లోకాలని కాపాడావు. మరి బీద బ్రాహ్మణ కుటుంబం ఏం చేసిందమ్మా! వారిని కూడా నువ్వు అనుగ్రహించవచ్చు కదాతల్లీ. అమ్మా గురుపత్ని ఎప్పుడూ శిష్యుడు యోగ్యుడా అయోగ్యుడా బాగా చదివే వాడా లేదా ఐశ్వర్యవంతుడా లేదా అని చూడదు కదా! అందరు శిష్యుల మీదా స్వపుత్రులలా మమకారంతో ఉంటుంది కదా! అమ్మా మరి నువ్వూ లోకానికే గురువైన వాని పత్నివి మరి ఎందుకమ్మా ఈ బ్రాహ్మణ కుటుంబాన్ని ఉద్దరించడంలో ఆలస్యం చేస్తున్నావు.?