Thursday, November 8, 2012

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-01

శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం
నమస్కారం!
శంకరుల స్తోత్రాలలో ఏదో ఒకస్తోత్రాన్ని తనివితీరా చదివి నలుగురితో పంచుకుందామని అమ్మవారే ప్రచోదనం చేయగా శంకరులు కూడా ఆశీర్వదించి ఉంటారు. అందుకే ఎన్నో నెలలుగా దీనిపై విచారణచేద్దామన్న నా కోరిక ఇలా తీరడానికి సిద్దమైంది. శంకరుల భిక్ష. ఇదే నాపాలిట కనకధార. అక్కడా ఇక్కడా చదివింది, గురువుగారు చెప్పగా విన్నవాటిలో నా అల్ప శక్తికున్న పరిధిమేరకు ఈ స్తోత్రాన్నినాలో స్థిరీకరించుకోటానికి చేసే ప్రయత్నమిది. ఎవరిమీదా రుద్దటానికి కాదని పెద్దలు గమనించాలి.

తప్పులున్న చోట పెద్దలను సరిదిద్దమని అర్థిస్తున్నాను.

జగద్గురువులైన శ్రీ ఆది శంకరుల అవతారంలో ప్రప్రథమంగా సన్యాసాశ్రమం తీసుకోకముందే బ్రహ్మచారిగా ఉన్నప్పుడే లోకోద్దరణకై చేసిన గొప్ప స్తోత్రమిది. ఈ స్తోత్రం అతి సులభంగా అందరూ పఠించే విధంగా తేలికైన శ్లోకాలతో ఈ స్తోత్రాన్ని ఇచ్చారు. ఈ స్తోత్రాన్ని లోకానికిచ్చేనాటికి వారు అతి చిన్నవారు కానీ అప్పటికే వారు సకల శాస్త్రాలనూ అవగతం చేసుకున్నారు... అలా అనడంకన్నా వారికి జన్మ తహా వచ్చినవి కాదు కాదు జన్మ తహా ఉన్నవే అంటే సరిగా కుదురుతుందేమో.
ఈ స్తోత్రం శ్రీ శంకరులు సన్యాసం తీసుకున్నాక ఇవ్వకూడదు కాబట్టి దానికి పూర్వమే ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి సన్యాసం తీసుకున్నాక ఇక ఎవరూ సన్యాసిని లౌకిక కోరికలు కోరకూడదు కోరినా ఆ కోరికలని ఆ సన్యాసి భగవత్పరం చేయాలి ప్రయత్నపూర్వకంగా కోరికలు తీర్చే స్తోత్రాదులు వగైరాలు ఇవ్వడం అంత కుదరని పని. కాబట్టే సన్యాసాశ్రమానికి ముందే ఇచ్చారు. మరి బ్రహ్మ చారిగదా బ్రహ్మచారికి ఇటువంటి స్తోత్రాలతో పని ఏముంది అని సందేహం రావచ్చు. బ్రహ్మచారి దానమిచ్చిన వారిని ఆశీర్వదించవచ్చు. బీద బ్రాహ్మణి వద్ద భిక్ష తీసుకున్న తరవాత, లక్ష్మీదేవిని ముగురమ్మల మూలపుటమ్మ గా స్తోత్రం చేసి తన ఆశీర్వాదంగా లక్ష్మీ అనుగ్రహం కలిగేటట్టు దీవించారు. ఈ స్తోత్రం ద్వారా మనకు శ్రేయోభివృద్ధి కలగడానికున్న అడ్డంకులని తొలగతోసుకుని సంసారాన్ని నడపడానికి, దాటడానికి కావలసినవి సమకూర్చుకోడానికి మన జాతికి వారు పెట్టిన భిక్ష ఈ స్తోత్రం.
ఈ శ్లోకాలు అప్పుడెప్పుడో రెండు వేల ఏళ్ళకి పూర్వం జరిగిన కనకధార మనకెలా పనికొస్తుంది అంటే, అప్పుడు వారు చేసిన స్తోత్రంలో బ్రాహ్మణి పేరుకాని ఆయన పేరు కాని పెట్టకుండా ఎవరు చదివినా వారే స్తోత్రం చేసినట్టు అన్వయమయ్యేలా స్తోత్రం చేయడం శంకరుల ప్రజ్ఙ, కాదు వారి ప్రజ్ఙకి తాఖీదులివ్వడానికి మనమెంత. అది వారి అపార కరుణతో కూడిన పరమాన్నపు భిక్ష.
ఇది కేవలం ధనాపేక్షకొరకు మాత్రమే చేయవలసిన స్తోత్రమా?
ఇతరులు మోక్షాపేక్ష కలిగినవారు చేయనవసరంలేదా?
ముమ్మాటికీ అలా కాదు! కేవలం ధనాపేక్ష కలిగినవారికే ఈ స్తోత్రం శంకరులు ఇస్తే వారు జగద్గురువుగా ఎలా నిలబడతారు. ఈ స్తోత్రంలో
వారు పరబ్రహ్మ తత్త్వాన్ని కీర్తించారు. పరబ్రహ్మము యొక్క కారుణ్యాన్నికీర్తించారు. ప్రారబ్ధాన్ని ఎవరూ దాటలేక దాని వల్ల కలిగిన ఆటంకంతో పుణ్యకార్యాలు చేయలేకపోతున్న వారి ప్రారబ్ధాన్ని పారదోయగల స్తోత్రమిది.

అర్థకామముల నుంచి మోక్ష సామ్రాజ్యము వరకూ ఇవ్వగల స్తోత్రం కనక ధార. అదే కదా అసలైన కనక ధార!
దురదృష్ట వంతుడిని ఉద్దరించడం కనక ధార!
దురితాలని తొలగతోయడం కనకధార!
ఐశ్వర్యాన్ని అనుభవైకవేద్యం చేయడం కనకధార!
అమ్మ కారుణ్యానికి దగ్గర చేయడం కనకధార!
పాపరాశిని ధ్వంసం చేసి మోక్షానికర్హత చేకూర్చడం కనకధార!
సకల విద్యలనూ కురిపించగల మేఘం కనక ధార!
కనకధార-కామకోటి!

పైన జరిపిన శంకరుల స్తుతియే గురువందనమై ఈ కార్యాన్ని గట్టెక్కించుగాక అని తలుస్తూ అస్మదాచార్యుల పాదాలు స్మరిస్తూ

గణేశ స్తుతి / హయగ్రీవ స్తుతి :
శ్లో!! వందే వందారు మందార మిందిరానంద కందళమ్ !
అమందానంద సందోహ బంధురం సింధురాననమ్ !!

తా (1)వందనము! గజముఖము తన ముఖముగా కలిగినటువంటి, నమస్కరించువారి లేదా శరణుజొచ్చు వారి పాలిట కల్ప వృక్షము వంటి వాడు,  తల్లి పార్వతీదేవి ఆనందమునకు మొలక వంటి వాడు, అమితాశ్చర్యమగు మహానందమును కోరు జ్ఙానులనుద్దరించువాడు (ఇక్కడ వినాయకుని పరబ్రహ్మ తత్త్వాన్నివర్ణించారు) ఐన ఆ విఘ్న వినాయకునికి నమస్కారము.

ఇక జగద్గురువులుగా వెళ్ళవలసిన బాల శంకరులు మొట్ట మొదట ఉపదేశంగా పలికిన స్తోత్రాన్ని "వందే" అంటూ మొదలెట్టారు. నమస్కారంతో మొదలు. అంటే జగద్గురువుగా నిలబడబోయే బాల శంకరులు లోకానికి చెప్పిన మొదటి బోధ నమస్కారం చెయ్యమని చెప్పడం.

ఆ నమస్కారాన్ని శాస్త్ర విహితంగా మొదలు వినాయకునికి నమస్సుతో మొదలు చేసిన శంకరులంతవారే వినాయకునికి మొదట చేయవలసిన నమస్కారం, పూజ గురించిన విషయాన్ని సనాతన ధర్మానికి వ్యతిరిక్త కాలంలో ధృవ పరిచారు. అందరూ వినాయకునికి మొదట నమస్కారం చేయవలసినదే.

నమస్కారం అంటేఐదు పంచేంద్రియాలు ఐదు జ్ఙానేంద్రియాలు బుద్ధిని నమస్కారం ఎవరికి చేస్తున్నామో వారి పరం చేయడం.
నమస్కారం చేయడం అంటే వినయాన్ని ఆవిష్కరించడం.
నమస్కారం చేయడం అంటే భక్తిని ఆవిష్కరించడం
నమస్కారం చేయడం అంటే ఎదుటివారి గొప్పతనాన్ని తనలోని తక్కువతనాన్ని గుర్తించడం.
నమస్కారం చేయడం అంటే ఉద్దరించమని అర్థించడం..
నమస్కారం చేయడం అంటే అనుగ్రహాన్ని వర్షింపచేసి ఆటంకాలని తొలగ తోయమనిఅడగడమే..
ఇలా చెప్తూ పోతే నమస్కారం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ( అసలు సుందరకాండలోని గమ్మత్తంతా నమస్కార ప్రభావమే. సుందరకాండలోని మలుపులన్నీ నమస్కారము, స్తుతుల చుట్టూనే తిరుగుతుంటాయి. అందుకే కాబోలు సుందరకాండ ఉపాసన చేసినవారు అంత వినయంగానూ ఉంటారు )



దీనినే ఈ క్రింది విధముగా కూడా అన్వ్యయం చేస్తారు..
తా (2): నమస్కరించువారి కోరికలు తీర్చు (మందారమను) దేవతావృక్షము వంటివాఁడును, తన పత్నియైన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆనందమునకు మొలక వంటివాఁడును, పండితులు (జ్ఞానులు) అనుభవించు బ్రహ్మానందమునకు కిరీటము వంటివాఁడును అగు హయగ్రీవునికి నమస్కారము చేయుచున్నాను.

ఏదైతేనేమి ...

(సశేషం..)


సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు,