Thursday, August 11, 2016

సాధన పఞ్చకమ్ (ఉపదేశ పఞ్చకమ్) (పఞ్చరత్నమాలికా)

శ్రీ గురుభ్యోనమః

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతి స్తజ్యతామ్ !
పాపౌఘః పరి ధూయతామ్ భవసుఖే దోషోనుసన్ధీయతాం
ఆత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ !! 1

ప్రతిదినము వేదాధ్యయనము చేయవలెను, అందులో చెప్పిన కర్మలు శ్రద్ధగ ఆచరించుము. ఈ కర్మాచరణమే ఈశ్వర పూజగా మారును గాక! కామ్య కర్మలను త్యజింపుము నిష్కామ కర్మలను చేయుము. పాపములను బోగొట్టుకొనుము. సంసార సుఖములోగల దోషముల నెరుగి జీవితమును అనుసంధానము చేసుకొనుము. ఆత్మ జ్ఙానము నందు ఇచ్చమును పెంపొందించుకొనుము. శీఘ్రమే నిజ గృహమునుండి వెడలుము.

సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం
శాన్త్యాదిః వరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ !
సద్ విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శృతిశిరోవాక్యంస మాకర్ణ్యతామ్ !! 2

సజ్జనులతో కలిసి ఉండుము, భగవంతుని యందు ధృఢమైన భక్తిని కలిగి యుండుము.
శాంత్యాది గుణములను ఆశ్రయించుము. కామ్య కర్మలను విసర్జించుము. సద్ విద్వాంసులను ఉపాసింపుము (సత్ యందు రమించు విద్వాంసులు అందుకే సద్ అను పదమ వేఱుగా చూపబడినది అని ఒక భావము). వారి పాదుకలను ప్రతి దినమూ సేవింపుము. బ్రహ్మ ప్రాప్తికి తోడ్పడు ఏకాక్షర బ్రహ్మ మంత్రమైన ఓం కారమంత్రమను సేవించుము, ఉపాసించుము. శ్రుతి శిరస్సులైన ఉపనిషత్ వాక్యములను వినుము.

వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరఃపక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్ సుమిమ్యతాంశృతిమతిస్తర్కోనుసన్థీయతామ్ !
బ్రహ్మైవాస్మి విభావ్యతామహరహర్తర్వః పరిత్యజ్యతాం
దేహేహం మతిరుజ్ ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ !! 3

తత్త్వమసి ఇత్యాది మహావాక్యముల అర్థమును విచారింపుము, వేదాంతమును ఆశ్రయింపుము.
"కుతర్కమును వీడుము". శ్రుతిసమ్మతమగు తర్కమును గ్రహింపుము. "నేను బ్రహ్మమును" అని ప్రతిదినము భావింపుము. గర్వాహంకారములను వీడుము. శరీరమున అహంబుద్ధిని వదిలి వేయుము. పెద్దలతో వాదులాడకుము (ఇక్కడ పెద్దలనగా జ్ఙానముచేత, అనుభవముచేత అని వ్యాఖ్యానము).

క్షుద్ వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నంనతు యాద్యతాంవిధివశాత్ ప్రాప్తేనసంతుష్యతామ్ !
శీతోష్ణా విసహ్యతాం స తు వృథావాక్యం సముచ్చార్యతాం
ఔదాసీస్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతామ్ !! 4

ఆకలి దప్పిక అను వ్యాధులకు చికిత్స కావింపుము. భిక్షాన్నమను ఔషధమును సేవింపుము. రుచికరమగు భోజనపదార్థములను యాచింపక, విధివశాత్ లభించిన దానితో తృప్తిని పొందుము. చలి, వేడి వంటి ద్వంద్వములను తితిక్షాబుద్ధితో సహింపుము. వ్యర్థముగ వాక్యోచ్చారణ చేయకుము ( అనవసర ప్రసంగములు అనవసర మాటలాడకుము). ఔదాసీన్యమును వహించుము. లోకుల యెడ నైష్ఠురడవు కాకూడదు.

ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సునమీక్ష్యతాం జగదిదంతద్బాధితందృశ్యతామ్ !
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నావ్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధస్త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ !! 5

ఏకాంత ప్రదేశమున సుఖముగ కూర్చుండుము. పర బ్రహ్మమున చిత్తమును సమాధాన మునర్చుము. ఈ జగత్తును పూర్ణబ్రహ్మముగ జూచుచు అది అంతయును విలీనమైనదిగ భావింపుము. పూర్వ కర్మముల క్షయమునొనర్చుకొనుము. జ్ఙానము నాశ్రయించి రాబోవు కర్మలయందాసక్తుడవు కాకుండ ఉండుము. ప్రారబ్ధ భోగము ననుభవించుచు, బ్రహ్మమున నెలకొనియుండుము.

యః శ్లోకపఞ్చకమిదం పఠతే మనుష్యః
నఞ్చిన్తయత్యనుదినం స్థిరతాముప్యేత !
తస్యాశు సంసృతిదవానలతీవ్రఘోర
తాపః ప్రశాన్తిముపయాతిచితి ప్రసాదాత్ !! 6

ఏ మానవుడు నిత్యమూ ఈ శ్లోక పంచకమును పఠించుచు, స్థిర చిత్తముతో భావార్థమును చింతించుచుండునో, అతడు శీఘ్రముగనే సంస్మృతి, తీవ్ర దావానల, తీవ్ర ఘోర తాపమును, చైతన్య స్వరూపుడైన ఈశ్వరును అనుగ్రహముచేత పోగొట్టుకొనును.

!!ఇతి శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాదవిరచిత సాధన పఞ్చకమ్!!
ఇది శ్రీ శంకర భగవత్ పాదులు రచించిన సాధన పంచకము

__________________________________
జయ జయ శంకర హర హర శంకర
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
జయ జయ శంకర హర హర శంకర
https://groups.google.com/group/satsangamu