Friday, October 11, 2013

అజ్ఞాన పఞ్చకమ్ { మాయా పఞ్చకమ్}

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

{ మాయా పఞ్చకమ్}

నిరుపమనిత్యనిరంశకేఽప్యఖణ్డే
            మయి చితి సర్వవికల్పనాదిశూన్యే
ఘటయతి జగదీశజీవభేదం
            త్వఘటితఘటనాపటీయసీమాయా
నిత్యుణ్ణి, నిరుపముణ్ణి, నిర్ అంశుణ్ణి అఖండుణ్ణి స్వయం జ్ఙానస్వరూపుణ్ణి ఐన నాయందు ఈ మాయ అజ్ఞానమును కలిగించి, జగత్తు, ఈశ్వరుడు, జీవుడు అను భేదాన్ని కలిగిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

శ్రుతిశతనిగమాన్తశోధకాన
            ప్యహహ ధనాదిదర్శనేన సద్యః
కలుషయతి చతుష్పదాద్యభిన్నాన్
            త్వఘటితఘటనాపటీయసీమాయా
వేదవాక్యములతోనూ, ఉపనిషద్ సూక్తులతోనూ ప్రభోధముచేసి చతుష్పాదులైన పశుపక్షాదులు జంతువులనుండి వేరుగా సంస్కరింపజేసినా కూడా ! ఆహా ఈ మాయ గొప్పదనమేమో..వారికి వెంటనే భోగింపదగు ధనమాదిగా సమస్త వస్తువులను చూపించి అవి పొందడం పోగొట్టుకోవడం అనే విషయములచే కలుషితులను కావిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

సుఖచిదఖణ్డవిబోధమద్వితీయం
            వియదనలాదివినిర్మితే నియోజ్య
భ్రమయతి భ్రమసాగరే నితాన్తం
            త్వఘటితఘటనాపటీయసీమాయా

అఖండ సచ్చిదానంద సుఖబోధస్వరూపమైన ఆత్మను ఈ మాయ ఆకాశాది పంచభూతనిర్మితమగు ఈ భవసాగరములో పడేసి, నిరంతరమూ కొట్టుకునేటట్టు చేస్తోంది.ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

అపగతగుణజాతివర్ణభేదే
            సుఖచితి విప్రవిదాద్యహఙ్కృతిం చ
స్ఫుటయతి సుతదారగేహమోహం
            త్వఘటితఘటనాపటీయసీమాయా
ఈ మాయ ఎంత గొప్పది, గుణ వర్ణ జాతి అనే భేద రహితుడైన, సుఖ చిత్ స్వరూపుడైన ఆత్మయందు బ్రాహ్మణాదిచాతుర్వర్ణాది రూపమగు అహంకారాన్ని, భార్య, భర్త, కొడుకు, ఇల్లు అనే మోహాలను కలిగిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

విధిహరహరివిభేదమప్యఖణ్డే
            బత విరచయ్య బుధానపి ప్రకామమ్
భ్రమయతి హరిహరభేదభావా
            త్వఘటితఘటనాపటీయసీమాయా
అఖండస్వరూపమైన బ్రహ్మంలో బ్రహ్మవిష్ణుశివ ఇత్యాది భేధములను నిర్మించి, బుధజన శ్రేష్ఠులు ఐన వారిని కూడా శివవిష్ణుభేదబుద్ధులుగా మార్చి ఆ భ్రమను కల్పిస్తూ ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది కదా!

ఇతి శ్రీమచ్ఛంకరభగవత్పాద విరచిత మాయా పఞ్చకమ్




Wednesday, June 12, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-12

శ్రీ గురుభ్యోన్నమః
శ్లో11!! శ్రుత్యై నమో౭స్తు శుభకర్మ ఫల ప్రసూత్యై
రత్యై నమో౭స్తు రమణీయ గుణార్ణవాయై !
శక్త్యై నమో౭స్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో౭స్తు పురుషోత్తమ వల్లభాయై !!
తా : శుభములైన శ్రౌత, స్మార్త కర్మలకు సముచిత ఫలములనిచ్చువేదమాతృస్వరూపురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. ఆనందపఱచు గుణములకు సముద్రము వంటి విశాఅమగు రతీదేవి స్వరూపురాలైన మాతకు ప్రణామము. నూఱు దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తిస్వరూపురాలికి వందనము. విష్ణుమూర్తికి ప్రియురాలై పుష్టి నొసగు ఇందిరాదేవికి నమస్కారములు.

వివరణ: వేదరూపిణియై సకల శుభ ఫలములను ఇచ్చు వేదస్వరూపమైన తల్లికి నమస్కారము, వేదము సకల శుభ కర్మలకు శుభఫలములనిచ్చు స్వరూపము, శ్రౌత స్మార్త కర్మలను ఒనగూర్చువారికి సకల శుభ ఫలములనిచ్చునది. వేదము స్వరూపము ధర్మ స్వరూపమే కాబట్టి ధర్మవర్తనులకు శుభ కర్మ ఫలాలనిచ్చు శక్తికలైగిన శ్రుతి స్వరూపమైన తల్లికి నమస్కారము. నానా రత్నములను తన గర్భములో దాచుకొనిన విశాలమైన సముద్రవలె, రమణీయమైన గుణములకు సముద్రమువంటిదైన రతీదేవి (అనుభవపూర్వకమూ చేయు శక్తిగాఉన్నటువంటి తల్లి, మన్మథుడు= కోరిక; రతి=అనుభవములోనికి వచ్చుట) వంటి తల్లికి నమస్కారములు. నూరు దళములు కలిగిన పద్మములో నుండు అన్ని శక్తులకూ ఆధారభూతమైన శక్తికి నమస్కారము. పురుషోత్తముడైన శ్రీహరికి పుష్టిని స్ఫూర్తిని కలిగించు తల్లి శ్రీ లక్ష్మీ దేవికి నమస్కారము.
సందర్భం ప్రకారం: అమ్మా వేద స్వరూపమైన తల్లివి నీవే కదా, వేదము శుభ కర్మలకు శుభ ఫలములిచ్చును కదా, పైగా ఇంత దరిద్రములోనూ అధర్మ మార్గము పట్టక ఉంఛవృత్తితో జీవనము సాగిస్తూ స్వాధ్యాయం చేసుకుంటూ గడుపుతున్న కుటుంబం బ్రాహ్మణ కుటుంబం. వేదాన్ని, ధర్మాన్ని నమ్మి నలుగురికీ బోధ చేయవలసిన బ్రాహ్మణ కుటుంబానికే శుభ ఫలములతో ఐశ్వర్యమునివ్వకపోతే వేదాన్ని, ధర్మాన్ని పాటించే వారు కరవై ధర్మ లుప్తమౌతుంది తల్లీ. లోకంలో ధర్మానికి ఆపద వచ్చినప్పుడు ధర్మాన్ని కాపాడే వాడు పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు అటువంటి శ్రీ మహా విష్ణువుకే స్ఫూర్తిని పుష్టిని ఇచ్చేదానవు నీవు, నీవు వీరికి ఐశ్వర్యమునిచ్చి వేదాన్ని ధర్మాన్ని నమ్మినవారికి ఆపదలు, ఇక్కట్లు లేకుండా చేయవలసిన దానవు నువ్వేకదాతల్లీ. అమ్మా కేవల ధనవృద్ధితోనే ఐశ్వర్యవంతులు కాలేరు కదాతల్లీ, ధన ధాన్య వృద్ధి అనుభవైకవేద్యమవ్వాలి ( మన్మథుడు కోరికకు రూపమైతే ఆయన పత్ని తల్లి రతీదేవి కోరిక అనుభవములోకి వచ్చినప్పటి అనుభూతి) సముద్రము ఎంత విశాలమో, ఎన్ని రత్నాలను అందులో దాచుకున్నదో అంత గొప్ప అనుభవైకవేద్యమైన అనుభూతులను ఇవ్వగలిగిన తల్లివి నువ్వు. తల్లీ వీరికి ఐశ్వర్యమునిచ్చి, పాపములను తీసి ఐశ్వర్యమును అనుభవైకవేద్యముగ చేయగల తల్లివి. అమ్మా అన్ని శక్తులకు మూలమైన శక్తివి నువ్వు నీకు అనుగ్రహాన్ని కురిపించుట అతి తేలికైన పని అమ్మా అంత గొప్ప తల్లివైన నీకు పునః పునః పునః ప్రణామాలు.

Wednesday, May 22, 2013

సారతత్త్వోపదేశము

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

సార తత్త్వోపదేశః

గురుబ్రహ్మ స్వయం సాక్షాత్ సేవ్యో వన్ద్యో ముముక్షిభిః
నో ద్వేహనీయ ఏవాయం కృతజ్ఞేన వివేకినా!!
            గురువు సాక్షాత్తుగ పరబ్రహ్మస్వరూపుడు, ముముక్షువులైనవారిచే సేవనీయుడు, వందనీయుడు. వివేకి, కృతజ్ఞుడు ఐన శిష్యుడు, గురువునకెన్నడూ కష్టము కలిగించడు.

యావదాయుస్త్రయో వన్ద్యో వేదాన్తో గురురీశ్వరః
మనసా కర్మణా వాచా శ్రుతేరేవైష నిశ్చయః!!
            జీవించి ఉన్ననాళ్ళు మనోవాక్కాయములతో వేదాంతములకు (ఉపనిషత్ విద్య), గురువునకు, ఈశ్వరునకు నమస్కారము చేయవలసినది. అని శ్రుతి నిశ్చయము చేసి ఉపదేశించుచున్నది.

భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం నకర్హిచిత్
అద్వైతం త్రిషులోకేషు నాద్వైతం గురుణా సహ!!
            అద్వైత భావమును ఎప్పుడూ కలిగి ఉండవలెను. కానీ ఎన్నడూ క్రియలో అద్వైత బుద్ధిని చూపవద్దు. ముల్లోకములయందూ అద్వైతబుద్ధిని ప్రదర్శించవచ్చు గానీ, ఎన్నడూ
గురువుపట్ల అద్వైత బుద్ధిని ప్రదర్శింపరాదు.

            (గురువుకి అద్వైత స్థితివల్ల తామిద్దరూ/సమస్తమూ ఒకటే అన్న భావన ఉండి ఉన్నా, శిష్యుడు ఎంత అద్వైత స్థితిలో ఉన్నా గురువు వేరు నేను వేరు కాదు అంతా ఒకటే అని అద్వైత బుద్ధి ప్రదర్శించరాదు, శరీరం ఉన్నంత వరకు శిష్యునికి గురువు వందనీయుడే)

ఇతి శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాదవిరచిత సారతత్త్వోపదేశః
ఇది శ్రీ శంకరభగవత్పూజ్యపాదులు బోధించిన సారతత్త్వోపదేశము


భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం నకర్హిచిత్

            శంకరుల అతి ముఖ్య సందేశాలలో మనం తప్పక ఆచరించాల్సిన వాటిలో ఇదీ ఒకటి, అద్వైత విమర్శకులు, అద్వైతంలో ఉన్నామనుక్కుని మాట్లాడేవారి మాటలకి శంకరులు ఏనాడో ఎలా ఉండాలో చెప్పారు.

            భావమునందు ఎల్లప్పుడూ అద్వైతాన్నే అనుష్ఠించవలెను అంత మాత్రాన శరీర ధర్మాన్ని వదలరాదు కదా, జీవనం ఉన్నంత వరకూ శరీరం ప్రకృతి పరంగా వేరుగా కనపడుతుంది దాని ధర్మాన్ని అది నిర్వర్తించాలి, ఐనా అద్వైత సిద్ధివల్ల అంతా ఒకటిగా స్థిరీకరింపబడినా, అది భావంలో ఉండాలి తప్ప క్రియారూపంలో కాదు, భావనల వల్ల క్రియాదోషం జరగరాదు. ఒకవేళ అంత పండినా గురువుయందు బుద్ధి ప్రదర్శించక గురువుని తనకన్న వేరైన అధికునిగానే ఎంచి నమస్కరించాలి.


జయ జయ శంకర హర హర శంకర - జయ జయ శంకర హర హర శంకర