Thursday, March 14, 2013

మీనాక్షీ పంచరత్నం



మీనాక్షీ పఞ్చరత్నమ్

ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం
బిమ్బోష్ఠీం స్మితదన్తపంక్తిరుచిరాం పీతామ్బరాలఙ్కృతామ్!
విష్ణుబ్రహ్మసురేన్ద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతొఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్!!!!
ఉదయించుచున్న వేలకోట్ల సూర్యులతో సమానమైనది, కంకణములతో, హారములతో ప్రకాశించుచున్నది, దొండపండ్లు వంటి పెదవులు కలది, చిరునవ్వు లొలుకుదంతముల కాంతి కలది, పీతాంబరములను ధరించినది, విష్ణు- బ్రహ్మ- దేవేంద్రులచే సేవించబడునది. తత్త్వస్వరూపిణియైనది, శుభము కల్గించునది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేన్దువక్త్రప్రభాం
శిఞ్జన్నూపురకిఙ్కిణీమణిధరాం పద్మప్రభాభాసురామ్|
సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్!!!!
ముత్యాలహారాలు అలంకరించిన కిరీటముతో శోభించుచున్నది, నిండు చంద్రుని వంటి ముఖకాంతి కలది, ఘల్లుమంటున్న అందెలు ధరించినది, పద్మములవంటి సౌందర్యము కలది, కోరికలనన్నిటినీ తీర్చునది, హిమవంతుని కుమార్తెయైనది, సరస్వతి- లక్ష్మీదేవులచే సేవించబడుచున్నది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీకారమన్త్రోజ్జ్వలాం
శ్రీచక్రాఙ్కిత బిన్దుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్!
శ్రీమత్షణ్ముఖవిష్ణురాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్!!!!
శ్రీ విద్యాస్వరూపిణి, శివుని ఎడమభాగమునందు నివసించునది, హ్రీంకార మంత్రముతో ఉజ్జ్వలమైన్నది, శ్రీచక్రములోని బిందువు మధ్య నివసించునది, ఈశ్వర్యవంతమైన సభకు అధిదేవతయైనది, కుమారస్వామి- వినాయకులకు కన్నతల్లియైనది, జగన్మోహినియైనది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
శ్రీమత్సున్దరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్!
వీణావేణుమృదఙ్గవాద్యరసికాం నానావిధాడమ్బికాం
మీనాక్షీం ప్రణతొఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్!!!!
సుందరేశ్వరుని భార్యయైనది, భయము తొలగింపచేయునది, జ్ఞానము నిచ్చునది, నిర్మలమైనది, నల్లని కాంతి కలది, బ్రహ్మదేవునిచే ఆరాధించబడునది, నారాయణుని సోదరియైనది, వీణ- వేణు- మృదంగవాద్యములను ఆస్వాదించునది, నానావిదములైన ఆడంబరములు కలది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
నానాయోగిమునీన్ద్రహృన్నివసతిం నానార్థసిద్ధప్రదాం
నానాపుష్పవిరాజితాఙ్ఘ్రియుగళాం నారాయణేనార్చితామ్!
నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్త్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్!!!!
అనేక యోగుల- మునీశ్వరుల హృయములందు నివశించునది, అనేకకార్యములను సిద్దింపచేయునది, బహువిధ పుష్పములతో అలంకరింపబడిన రెండుపాదములు కలది, నారాయణునిచే పూజింపబడునది, నాదబ్రహ్మస్వరూపిణియైనది, శ్రేష్ఠమైనదాని కంటే శ్రేష్ఠమైనది, అనేక పదార్థముల తత్త్వమైనది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
!!ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్ శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ మీనాక్షీ పఞ్చరత్నం సమ్పూర్ణమ్!!

జయ జయ శఙ్కర హర హర శఙ్కర

source: kamakoti.org



శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-07

శ్లో6!! బాహ్యాంతరే మధుజిత: శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి !
కామప్రదా భగవతో౭పి కటాక్ష మాలా
కల్యాణ మావహతు మే కమలాలయాయా: !!
తా : శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష: స్థలమునందలి కౌస్తుభ మణి నాశ్రయించి దాని లోపల, వెలుపల కూడ ఇంద్రనీల మణిహారములవంటి ఓరచూపులను ప్రసరింప జేయుచు కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !

వివరణ: శ్రీ శంకరులు శ్లోకంలో శ్రీ హరిని మధుజితః అన్న నామంతో సంబోధించారు. పై శ్లోకంలో వివరించినట్లు మధువు=నేను; కైటభుడు=నాది అనే గుణాలు. ముందు నాది అనే భ్రాంతిని తొలగతోసి తరవాత నేను అనే అహంకారాన్ని తొలగతోయగలడు శ్రీ హరి అన్న అర్థాన్ని స్ఫురించేలా ముందు శ్లోకంలో కైటభారే అని తరవాత శ్లోకంలో మధుజిత్ అన్న నామాన్ని వాడారు. నేను నాది అన్న భావన పోయిననాడు మనిషికి పాప కర్మలు చేయవలసిన పని ఉండదు, నేను నాది అన్న భావన తొలగుతే అంతా పరబ్రహ్మమును చూస్తూ ఆత్మగా మిగిలిపోయి, తన పక్కవారి బాధను తనదిగా తలచి వారికి వలసిన దాన ధర్మాలు సహాయాలు చేయగలడు. మధు కైటభులను సంహరించిన శ్రీమహావిష్ణువు వక్షస్థలమందు అమ్మ లక్ష్మీదేవి కొలువై ఉండి తన చూపులను ప్రసారం చేయగా చూపులు ఆయన హృదయంలోనూ, బయట ఉన్న కౌస్తుభమణికి గొప్పనైన ప్రకాశముని ఇవ్వగలిగిన చూపులు చూపులు. తనతోపాటు సముద్రములో పుట్టినదే ఐనా కౌస్తుభమణి కాంతులు అమ్మ చూపుల కాంతి వల్లనే ప్రకాశిస్తున్నాయి అన్న అర్థం కూడా అన్వయమయ్యేటట్టు తల్లి లక్ష్మీదేవిని "కమలాలయాయాః" అని సంబోధించారు. విష్ణువక్షస్థలవాసిని ఐన తల్లి నల్లని చల్లని చూపులు విష్ణు భగవానుని గుండెలపై వేసిన ఇంద్రనీలమణుల హారములవలె ఉన్నాయి. అటువంటి చల్లని చూపులు మాకు శ్రేయస్సునుచేకూర్చుగాక.

సందర్భం ప్రకారం: అమ్మా స్వయంగా శ్రీ విష్ణుభగవానుని కోర్కెలే తీర్చగల శక్తివి నీవు, విష్ణుభగవానుడు ఇతరుల కోర్కెలు తీరుస్తున్నాడూ అంటే దానికి మూల శక్తివి నువ్వెకదమ్మా! నేను నాది అన్న భావంతోటే పోయినజన్మలో చేసిన పుణ్యం లేక ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నారు బీద బ్రాహ్మణులు. అందరికోర్కెలు తీర్చే విష్ణుభగవానునికి కోర్కెలుతీర్చేశక్తిగా ఆయన గుండెలలో ఉన్నది నువ్వేకదమ్మా . అటువంటి మీ చూపులు ఒక్కసారి వీరి మీద ప్రసరిస్తే చూపులు వారికి శ్రేయస్సును కలిగిస్తాయి అని శంకరులు ప్రార్థించారు.