Thursday, July 4, 2019

జగన్నాథాకష్టకం

కదాచి త్కాళిన్దీ తటవిపినసఙ్గీతకపరో - ముదా గోపీనారీ వదనకమలాస్వాదమధుపః
రమాశమ్భుబ్రహ్మా మరపతిగణేశార్చితపదో - జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౧ ||

భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే - దుకూలం నేత్రాన్తే సహచర కటాక్షం విదధతే
సదా శ్రీమద్బృన్దా వనవసతిలీలాపరిచయో - జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౨ ||

మహామ్భోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే - వసన్ప్రాసాదాన్తస్సహజ బలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థ స్సకలసురసేవావసరదో - జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౩ ||

కథాపారావారా స్సజలజలదశ్రేణిరుచిరో - రమావాణీసౌమ స్సురదమలపద్మోద్భవముఖైః
సురేన్ద్రై రారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో - జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౪ ||

రథారూఢో గచ్ఛ న్పథి మిళఙతభూదేవపటలైః - స్తుతి ప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః
దయాసిన్ధు ర్భాను స్సకలజగతా సిన్ధుసుతయా - జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౫ ||

పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో - నివాసీ నీలాద్రౌ నిహితచరణోనన్తశిరసి
రసానన్దో రాధా సరసవపురాలిఙ్గనసుఖో - జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౬ ||

న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకితాం భోగవిభవం - న యాచే౽ హం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూం
సదా కాలే కాలే ప్రమథపతినా చీతచరితో - జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౭ ||

హర త్వం సంసారం ద్రుతతర మసారం సురపతే - హర త్వం పాపానాం వితతి మపరాం యాదవపతే
అహో దీనానాథం నిహిత మచలం నిశ్చితపదం -  జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౮ ||

ఇతి  శ్రీ ఆది శఙ్కరభగవ్త్పాదాచార్య కృత  జగన్నాథాకష్టకం

Wednesday, August 1, 2018

మీనాక్షీస్తోత్రమ్


మీనాక్షీస్తోత్రమ్


శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రిరాజరాజార్చితే
శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చింతామణీపీఠికే!
శ్రీవాణీగిరిజానుతాఙ్ఘ్రికమలే శ్రీశామ్భవి శ్రీశివే
మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనామ్బికే!!!!
శ్రీవిద్యా స్వరూపిణివి, శివుని ఎడమ భాగమునందు నివసించుదానవు, కుబేరునిచే పూజింపబడు దానవు, శ్రీనాధుని మొదలగు గురువుల ( విష్ణు- బ్రహ్మ- మహేశ్వరులు ) స్వరూపమైన దానవు, చింతామణీ పీఠమునందుండు దానవు, లక్ష్మీ- సరస్వతీ- పార్వతులచే నమస్కరించబడు పాదపద్మముల కలదానవు, శివుని భార్యవు, మంగళ స్వరూపిణివి, మధ్యాహ్న సమయమునందు మలయద్వజ మహారాజుకు కుమార్తెగా అవతరించిన దానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

చక్రస్థేఽచపలే చరాచరజగన్నాథే జగత్పూజితే
ఆర్తాలీవరదే నతాభయకరే వక్షోజభారాన్వితే!
విద్యే వేదకలాపమౌళివిదితే విద్యుల్లతావిగ్రహే
మాతః పూర్ణసుధారసార్ద్రహృదయే మాం పాహి మీనామ్బికే!!!!
శ్రీచక్రమునందుండు దానవు, స్థిరమైన దానవు, చరాచర ప్రపంచమును పాలించుదానవు, జగత్తులచే పూజింపబడు దానవు, దీనులకు వరము లిచ్చేడిదానవు, భక్తులకు అభయమొసంగు దానవు, స్తనభారము కల దానవు, విద్యాస్వరూపిణివి, వేదాంతముచేతెలియబడుదానవు, మెరుపు వంటి శరీరము కల దానవు, తల్లివి, అమృతముతో ఆర్ధ్రమైన హృదయము కలదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

కోటీరాంగదరత్నకుణ్డలధరే కోదణ్డబాణాఞ్చితే
కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలమ్బిహారాఞ్చితే!
శిఞ్జన్నూపురపాదసారసమణిశ్రీపాదుకాలఙ్కృతే
మద్దారిద్ర్యభుజఙ్గగారుడఖగే మాం పాహీ మీనామ్బికే!!!!
కిరీటము- కంకణములు- రత్నకుండలములు అలంకరించుకున్న దానవు, ధనుస్సు- బాణము పట్టుకున్న దానవు, చక్రవాక పక్షుల వంటి రెండు స్తనములపై ప్రకాశముగా వ్రేలాడుచున్న హారములు అలంకరించుకున్న దానవు, ఘల్లుమను గజ్జెలతోనూ, మణులతో శోభిల్లుపాదుకలతోనూ అలంకరించబడిన పాదము కల దానవు, నా దారిద్ర్యమను సర్పమును సంహరించు గరుడపక్షివంటి దానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే ప్రేతాసనాన్తస్థితే
పాశోదఙ్కుశ చాపబాణకలితే బాలేన్దుచూడాఞ్చితే!
బాలే బాలకురఙ్గలోలనయనే బాలార్కకోట్యుజ్జ్వలే
ముద్రారాధితదేవతే మునిసుతే మాం పాహీ మీనామ్బికే!!!!
బ్రహ్మ- విష్ణు- మహేశ్వరులచే స్తుతింపబడు దానవు, బ్రహ్మ- విష్ణు- రుద్రఈశ్వర- సదాశివులను పంచప్రేతల ఆసనము నధిష్టించిన దానవు, పాశము- అంకుశము- ధనుస్సు- బాణము ధరించిన దానవు, తలపై బాల చంద్రుని అలంకరించుకున్న దానవు, బాలవు, లేడిపిల్లవంటి చంచలమైన కన్నులు కల దానవు, కోట్లాది బాలసూర్యులవలె పకాశించుచున్న దానవు, ముద్రలచే ఆరాధించబడు దేవతవు, మునులచే ప్రార్థింపబడుదానవు, అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

గన్ధర్వామరయక్షపన్నగనుతే గంగాధరాలిఙ్గితే
గాయత్రీగరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే!
ఖాతీతే ఖలదారుపావకశిఖే ఖద్యోతకోట్యుజ్జ్వలే
మన్త్రారాధితదేవతే మునిసుతే మాం పాహీ మీనామ్బికే!!!!
గంధర్వులు- దేవతలు- యక్షులు- సర్పములచే స్తుతించబడుదానవు, శివునిచే ఆలింగనము చేసుకొనబడినదానవు, నిన్ను స్తుతించినవారిని రక్షించుదానవు, గరుడునిపై కూర్చున్న దానవు, కమలము నందు పుట్టిన దానవు, నల్లని దానవు, స్థిరమైన దానవు, ఆకాశమును అతిక్రమించిన దానవు, దుష్టులనే కొయ్యలను తగుల పెట్టు అగ్నిజ్వాలవు, కోట్లాది సూర్యుల వలే వెలుగొందుచున్న దానవు, మంత్రములచే ఆరాధింపబడు దేవతవు, అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

నాదే నారదతుంబురాద్యవినుతే నాదాంతనాదాత్మికే
నిత్యే నీలలతాత్మికే నిరుపమే నీవారశూకోపమే!
కాన్తే కామకలే కదమ్బనిలయే కామేశ్వరాఙ్కస్థితే
మద్విద్యే మదభీష్టకల్పలతికే మాం పాహీ మీనామ్బికే!!!!
నాదస్వరూపిణివి, నారదుడు- తుంబురుడు మొదలైన వారిచే స్తుతించబడు దానవు, నాదము చివరనుండు అనునాద స్వరూపిణివి, నిత్యమైన దానవు, నల్లని లత వంటి శరీరము కల దానవు, సాటిలేని దానవు, ధాన్యపు గింజ పై నుండు మొనవలే సూక్ష్మమైన దానవు, మనోహరమైన దానవు, కామకళాస్వరూపిణివి, కడిమి చెట్లవనము నందుండు దానవు, కామేశ్వరుని ఒడిలో కూర్చున్న దానవు, నా జ్ఞానస్వరూపిణివి, నాకోరికలు తీర్చు కల్పలతవు, అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

వీణానాదనిమీలితార్థనయనే విస్రస్థచూలీభరే
తామ్బూలారుణపల్లవాధరయుతే తాటఙ్కహారాన్వితే!
శ్యామే చన్ద్రకలావతంసకలితే కస్తూరికాఫాలికే
పూర్ణే పూర్ణకలాభిరామవదనే మాం పాహీ మీనామ్బికే!!!!
వీణానాదము వినుచు మూసిన అరమోడ్పు కన్నులు కలదానవు, కొంచెముగా జారిన కొప్పు కల దానవు, తాంబూలముచే ఎర్రనైన చిగురుటాకుల వంటి పెదవి కల దానవు, కొమ్మలు- హారములు అలంకరించుకున్నదానవు, నల్లని దానవు, చంద్ర కళను శిరోభూషణముగా అలంకరించుకున్న దానవు, నొసటి పై కస్తూరి తిలకమును ధరించిన దానవు, పరిపూర్ణురాలవు, పూర్ణచంద్రునివలె అందమైన ముఖము కలదానవు, అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ
నిత్యానన్దమయీ నిరంజనమయీ తత్త్వంమయీ చిన్మయీ!
తత్త్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహీ మీనామ్బికే!!!!
శబ్ద బ్రహ్మ స్వరూపిణివి, చరాచరజగత్స్వరూపిణివి, జ్యోతిర్మయివి, వాఙ్మయివి, నిత్యానందరూపిణివి, నిరంజన స్వరూపిణివి, ’తత్- త్వం’ శబ్దములకు అర్థమైన దానవు, జ్ఞానమూర్తివి, తత్త్వములకతీతమైన దానవు, శ్రేష్ఠమైన వాని కంటే శ్రేష్ఠమైన దానవు, మాయా స్వరూపిణివి, లక్ష్మీ స్వరూపిణివి, సర్వైశ్వర్యములతో పరిపూర్ణురాలవు, సదాశివ స్వరూపురాలవు, అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

జయ జయ శఙ్కర హర హర శఙ్కర

source: kamakoti.org


Thursday, August 11, 2016

సాధన పఞ్చకమ్ (ఉపదేశ పఞ్చకమ్) (పఞ్చరత్నమాలికా)

శ్రీ గురుభ్యోనమః

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతి స్తజ్యతామ్ !
పాపౌఘః పరి ధూయతామ్ భవసుఖే దోషోనుసన్ధీయతాం
ఆత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ !! 1

ప్రతిదినము వేదాధ్యయనము చేయవలెను, అందులో చెప్పిన కర్మలు శ్రద్ధగ ఆచరించుము. ఈ కర్మాచరణమే ఈశ్వర పూజగా మారును గాక! కామ్య కర్మలను త్యజింపుము నిష్కామ కర్మలను చేయుము. పాపములను బోగొట్టుకొనుము. సంసార సుఖములోగల దోషముల నెరుగి జీవితమును అనుసంధానము చేసుకొనుము. ఆత్మ జ్ఙానము నందు ఇచ్చమును పెంపొందించుకొనుము. శీఘ్రమే నిజ గృహమునుండి వెడలుము.

సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం
శాన్త్యాదిః వరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ !
సద్ విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శృతిశిరోవాక్యంస మాకర్ణ్యతామ్ !! 2

సజ్జనులతో కలిసి ఉండుము, భగవంతుని యందు ధృఢమైన భక్తిని కలిగి యుండుము.
శాంత్యాది గుణములను ఆశ్రయించుము. కామ్య కర్మలను విసర్జించుము. సద్ విద్వాంసులను ఉపాసింపుము (సత్ యందు రమించు విద్వాంసులు అందుకే సద్ అను పదమ వేఱుగా చూపబడినది అని ఒక భావము). వారి పాదుకలను ప్రతి దినమూ సేవింపుము. బ్రహ్మ ప్రాప్తికి తోడ్పడు ఏకాక్షర బ్రహ్మ మంత్రమైన ఓం కారమంత్రమను సేవించుము, ఉపాసించుము. శ్రుతి శిరస్సులైన ఉపనిషత్ వాక్యములను వినుము.

వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరఃపక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్ సుమిమ్యతాంశృతిమతిస్తర్కోనుసన్థీయతామ్ !
బ్రహ్మైవాస్మి విభావ్యతామహరహర్తర్వః పరిత్యజ్యతాం
దేహేహం మతిరుజ్ ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ !! 3

తత్త్వమసి ఇత్యాది మహావాక్యముల అర్థమును విచారింపుము, వేదాంతమును ఆశ్రయింపుము.
"కుతర్కమును వీడుము". శ్రుతిసమ్మతమగు తర్కమును గ్రహింపుము. "నేను బ్రహ్మమును" అని ప్రతిదినము భావింపుము. గర్వాహంకారములను వీడుము. శరీరమున అహంబుద్ధిని వదిలి వేయుము. పెద్దలతో వాదులాడకుము (ఇక్కడ పెద్దలనగా జ్ఙానముచేత, అనుభవముచేత అని వ్యాఖ్యానము).

క్షుద్ వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నంనతు యాద్యతాంవిధివశాత్ ప్రాప్తేనసంతుష్యతామ్ !
శీతోష్ణా విసహ్యతాం స తు వృథావాక్యం సముచ్చార్యతాం
ఔదాసీస్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతామ్ !! 4

ఆకలి దప్పిక అను వ్యాధులకు చికిత్స కావింపుము. భిక్షాన్నమను ఔషధమును సేవింపుము. రుచికరమగు భోజనపదార్థములను యాచింపక, విధివశాత్ లభించిన దానితో తృప్తిని పొందుము. చలి, వేడి వంటి ద్వంద్వములను తితిక్షాబుద్ధితో సహింపుము. వ్యర్థముగ వాక్యోచ్చారణ చేయకుము ( అనవసర ప్రసంగములు అనవసర మాటలాడకుము). ఔదాసీన్యమును వహించుము. లోకుల యెడ నైష్ఠురడవు కాకూడదు.

ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సునమీక్ష్యతాం జగదిదంతద్బాధితందృశ్యతామ్ !
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నావ్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధస్త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ !! 5

ఏకాంత ప్రదేశమున సుఖముగ కూర్చుండుము. పర బ్రహ్మమున చిత్తమును సమాధాన మునర్చుము. ఈ జగత్తును పూర్ణబ్రహ్మముగ జూచుచు అది అంతయును విలీనమైనదిగ భావింపుము. పూర్వ కర్మముల క్షయమునొనర్చుకొనుము. జ్ఙానము నాశ్రయించి రాబోవు కర్మలయందాసక్తుడవు కాకుండ ఉండుము. ప్రారబ్ధ భోగము ననుభవించుచు, బ్రహ్మమున నెలకొనియుండుము.

యః శ్లోకపఞ్చకమిదం పఠతే మనుష్యః
నఞ్చిన్తయత్యనుదినం స్థిరతాముప్యేత !
తస్యాశు సంసృతిదవానలతీవ్రఘోర
తాపః ప్రశాన్తిముపయాతిచితి ప్రసాదాత్ !! 6

ఏ మానవుడు నిత్యమూ ఈ శ్లోక పంచకమును పఠించుచు, స్థిర చిత్తముతో భావార్థమును చింతించుచుండునో, అతడు శీఘ్రముగనే సంస్మృతి, తీవ్ర దావానల, తీవ్ర ఘోర తాపమును, చైతన్య స్వరూపుడైన ఈశ్వరును అనుగ్రహముచేత పోగొట్టుకొనును.

!!ఇతి శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాదవిరచిత సాధన పఞ్చకమ్!!
ఇది శ్రీ శంకర భగవత్ పాదులు రచించిన సాధన పంచకము

__________________________________
జయ జయ శంకర హర హర శంకర
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
జయ జయ శంకర హర హర శంకర
https://groups.google.com/group/satsangamu

Thursday, April 23, 2015

శఙ్కరజయన్తి

శ్రీ గురుభ్యోనమః

          సృష్టిలో 84 లక్షల జంతుకోటి ఉన్నదని చెప్పబడింది. ఈ సమస్త జీవకోటి నిరంతరమూ ప్రయత్నించేది దేనికి అని ప్రశ్న వస్తే దాని సమాధానం ’సుఖముగా ఉండడం కొరకు మాత్రమే’ అన్నది నిర్వివాద సమాధానం. ఎంత కష్టపడ్డాఏ పని చేసినా చేయకున్నా ప్రతి జీవి ప్రయత్నించి కోరుకునేది సుఖమే. ఏ ప్రాణీ కూడా నాకు సుఖమక్కరలేదు అని చెప్పదు కదా... పైగా ఎంత ఎక్కువ సుఖం పొందాలా అని తాపత్రయపడుతూ ఉంటుంది. అన్ని వృత్తులు సుఖము కొరకే అని కదా ఆర్యోక్తి.

          పరిశీలనమువివేచనవివేకముబుద్ధి అను వివిధ వివిధములుగా వ్యావహారికంలో తెలియబడుతున్న విలక్షణమొకటి మనిషిని మొత్తం 84 లక్షల జంతుకోటి నుండి వేరు చేస్తున్నది. బుద్ధి వికసనము చేత పరిశీలనము చేత మాత్రమే మనిషి మిగిలిన జీవరాశినుండి వేరుపడి విశిష్టమైన జంతువు/జీవిగా తెలియబడుతున్నాడు. మనిషి ఈ అన్ని సుఖములు అనుభవించినమాత్రకన్నా ఎక్కువ అనుభవించుటచేత దుఃఖములే అవుతున్నాయని యెఱిగి అసలు సుఖమును గూర్చిన విచారణ చేయగలిగినవాడు మనిషి ఒక్కడే. అది ఏ సుఖముదాని సాధన విశేషాలేమిటి వగైరా వగైరా పరిశీలనము చేయాలి. ఆ వివేకమే మనిషిగా పుట్టిన వాడు చెయ్యవలసినది ముఖ్యమైనదీనూ... అలా పరిశీలనమువివేకము లేని మానవ జన్మకు విశిష్టత కుదరదుతక్కిన జంతుకోటితో ఆమనిషిని కూడా కలిపి చెప్పవలసి ఉంటుంది.
          ఈ పరిశీలనలో కలిగే ముందు అనుమానాలాలో నేనెలా వచ్చాను ఎందుకు వచ్చానుఈ కనపడుతున్నదంతా ఎలా వచ్చింది సృష్టి ఆది ఏది ఇలా సాగుతుంది... వీనికి సమాధానం కేవల మానవ మేధస్సుకు సాధ్యం కాదు కారణం దేనినీ మానవుడు సాధించలేదు అంటే నిర్మించలేదు. దీనిని సాధించుటకు అసలు సృష్టి ఎవరు చేసారు వారి సహాయం కోరుతుంది మన బుద్ధి. ఆయనను పరబ్రహ్మంగా తెలిసి దానినుండి వ్యక్తమైన వేదవేదాంతవేదాంగాదులను సహాయముగా తీసుకుని విచారణ మొదలుపెడుతుంది. అవి అందరికీ అందనివి అవ్వడం వలన కారుణ్య మూర్తులైన ఋషులు తేలికగా తంత్ర,పురాణేతిహాసాల రూపంలో అందించగా మరింత తేలిక చేసినవారు వ్యాసులు. వేద వేదాంతాలను బ్రహ్మ సూత్రాలుగా వేదాంత సారాన్ని భగవద్గీతగాపురాణాలుగా ఎంతో అపారమైన వాఙ్మయాన్ని అందించారు. 
          కానీకలిలో మానవులు అలసులుమందబుద్దులుఅల్పాయుష్కులుఅవైదిక మార్గ తత్పరులు అవ్వడం చేత సాక్షాత్ దక్షిణామూర్తియే కలియుగంలో మరో గురుమూర్తిగా "జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భగవత్పాదులు"గా అవతరించి సామాన్య మానవ మేధస్సులకందని నిగూఢమైన వేదఔపనిషద్తంత్రమంత్రపురాణ స్తోత్రాదులను సులభరీతులలో ప్రకరణ గ్రంథాలుగాస్తోత్రాలుగాఇచ్చి ప్రస్థాన త్రయ భాష్యమిచ్చి నిగూఢమైన శాస్త్రార్థములను సామాన్య మానవుని దగ్గరకు చేర్చారు. అవైదిక మత ప్రాచుర్యాన్ని ఖండించి సంస్కరించి షాణ్మత స్థాపన చేసారు పంచాయతన పూజ నెలకొల్పారు. భారతావని చుట్టూ నాలుగు ఆమ్నాయ (ఆమ్నాయము=వేదము) మఠాలు పెట్టారు. కంచిలో సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. ఇవేకాక కాశీలో ఉన్న గురుపీఠము (ప్రస్తుతం శృంగేరి వారి అధీనమునందు ఉన్నది) కూడా వారి స్థాపనయే అని కర్ణప్రమాణం. ఈ నాడు సిద్ధాంతాలకతీతంగా షాణ్మతాలవారమూ మన ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నామంటేపూజిస్తున్నామంటేస్తుతిస్తున్నామంటేవేద ఘోష వినపడుతోందంటేమన ధర్మంలో చరిస్తున్నామంటే అది కేవల శంకరుల కఠోర శ్రమ ఫలితం తప్ప మరోటి కాదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిఐకమత్యాన్ని నెలకొల్పిన మహానుభావుడు. 
          అటువంటి శంకరులకి కృతజ్ఞతాపూర్వక సాష్టాంగవందనాలు సమర్పిస్తూ ,
-శంకర కింకర...

          సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు...

Friday, October 11, 2013

అజ్ఞాన పఞ్చకమ్ { మాయా పఞ్చకమ్}

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

{ మాయా పఞ్చకమ్}

నిరుపమనిత్యనిరంశకేఽప్యఖణ్డే
            మయి చితి సర్వవికల్పనాదిశూన్యే
ఘటయతి జగదీశజీవభేదం
            త్వఘటితఘటనాపటీయసీమాయా
నిత్యుణ్ణి, నిరుపముణ్ణి, నిర్ అంశుణ్ణి అఖండుణ్ణి స్వయం జ్ఙానస్వరూపుణ్ణి ఐన నాయందు ఈ మాయ అజ్ఞానమును కలిగించి, జగత్తు, ఈశ్వరుడు, జీవుడు అను భేదాన్ని కలిగిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

శ్రుతిశతనిగమాన్తశోధకాన
            ప్యహహ ధనాదిదర్శనేన సద్యః
కలుషయతి చతుష్పదాద్యభిన్నాన్
            త్వఘటితఘటనాపటీయసీమాయా
వేదవాక్యములతోనూ, ఉపనిషద్ సూక్తులతోనూ ప్రభోధముచేసి చతుష్పాదులైన పశుపక్షాదులు జంతువులనుండి వేరుగా సంస్కరింపజేసినా కూడా ! ఆహా ఈ మాయ గొప్పదనమేమో..వారికి వెంటనే భోగింపదగు ధనమాదిగా సమస్త వస్తువులను చూపించి అవి పొందడం పోగొట్టుకోవడం అనే విషయములచే కలుషితులను కావిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

సుఖచిదఖణ్డవిబోధమద్వితీయం
            వియదనలాదివినిర్మితే నియోజ్య
భ్రమయతి భ్రమసాగరే నితాన్తం
            త్వఘటితఘటనాపటీయసీమాయా

అఖండ సచ్చిదానంద సుఖబోధస్వరూపమైన ఆత్మను ఈ మాయ ఆకాశాది పంచభూతనిర్మితమగు ఈ భవసాగరములో పడేసి, నిరంతరమూ కొట్టుకునేటట్టు చేస్తోంది.ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

అపగతగుణజాతివర్ణభేదే
            సుఖచితి విప్రవిదాద్యహఙ్కృతిం చ
స్ఫుటయతి సుతదారగేహమోహం
            త్వఘటితఘటనాపటీయసీమాయా
ఈ మాయ ఎంత గొప్పది, గుణ వర్ణ జాతి అనే భేద రహితుడైన, సుఖ చిత్ స్వరూపుడైన ఆత్మయందు బ్రాహ్మణాదిచాతుర్వర్ణాది రూపమగు అహంకారాన్ని, భార్య, భర్త, కొడుకు, ఇల్లు అనే మోహాలను కలిగిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

విధిహరహరివిభేదమప్యఖణ్డే
            బత విరచయ్య బుధానపి ప్రకామమ్
భ్రమయతి హరిహరభేదభావా
            త్వఘటితఘటనాపటీయసీమాయా
అఖండస్వరూపమైన బ్రహ్మంలో బ్రహ్మవిష్ణుశివ ఇత్యాది భేధములను నిర్మించి, బుధజన శ్రేష్ఠులు ఐన వారిని కూడా శివవిష్ణుభేదబుద్ధులుగా మార్చి ఆ భ్రమను కల్పిస్తూ ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది కదా!

ఇతి శ్రీమచ్ఛంకరభగవత్పాద విరచిత మాయా పఞ్చకమ్




Wednesday, June 12, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-12

శ్రీ గురుభ్యోన్నమః
శ్లో11!! శ్రుత్యై నమో౭స్తు శుభకర్మ ఫల ప్రసూత్యై
రత్యై నమో౭స్తు రమణీయ గుణార్ణవాయై !
శక్త్యై నమో౭స్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో౭స్తు పురుషోత్తమ వల్లభాయై !!
తా : శుభములైన శ్రౌత, స్మార్త కర్మలకు సముచిత ఫలములనిచ్చువేదమాతృస్వరూపురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. ఆనందపఱచు గుణములకు సముద్రము వంటి విశాఅమగు రతీదేవి స్వరూపురాలైన మాతకు ప్రణామము. నూఱు దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తిస్వరూపురాలికి వందనము. విష్ణుమూర్తికి ప్రియురాలై పుష్టి నొసగు ఇందిరాదేవికి నమస్కారములు.

వివరణ: వేదరూపిణియై సకల శుభ ఫలములను ఇచ్చు వేదస్వరూపమైన తల్లికి నమస్కారము, వేదము సకల శుభ కర్మలకు శుభఫలములనిచ్చు స్వరూపము, శ్రౌత స్మార్త కర్మలను ఒనగూర్చువారికి సకల శుభ ఫలములనిచ్చునది. వేదము స్వరూపము ధర్మ స్వరూపమే కాబట్టి ధర్మవర్తనులకు శుభ కర్మ ఫలాలనిచ్చు శక్తికలైగిన శ్రుతి స్వరూపమైన తల్లికి నమస్కారము. నానా రత్నములను తన గర్భములో దాచుకొనిన విశాలమైన సముద్రవలె, రమణీయమైన గుణములకు సముద్రమువంటిదైన రతీదేవి (అనుభవపూర్వకమూ చేయు శక్తిగాఉన్నటువంటి తల్లి, మన్మథుడు= కోరిక; రతి=అనుభవములోనికి వచ్చుట) వంటి తల్లికి నమస్కారములు. నూరు దళములు కలిగిన పద్మములో నుండు అన్ని శక్తులకూ ఆధారభూతమైన శక్తికి నమస్కారము. పురుషోత్తముడైన శ్రీహరికి పుష్టిని స్ఫూర్తిని కలిగించు తల్లి శ్రీ లక్ష్మీ దేవికి నమస్కారము.
సందర్భం ప్రకారం: అమ్మా వేద స్వరూపమైన తల్లివి నీవే కదా, వేదము శుభ కర్మలకు శుభ ఫలములిచ్చును కదా, పైగా ఇంత దరిద్రములోనూ అధర్మ మార్గము పట్టక ఉంఛవృత్తితో జీవనము సాగిస్తూ స్వాధ్యాయం చేసుకుంటూ గడుపుతున్న కుటుంబం బ్రాహ్మణ కుటుంబం. వేదాన్ని, ధర్మాన్ని నమ్మి నలుగురికీ బోధ చేయవలసిన బ్రాహ్మణ కుటుంబానికే శుభ ఫలములతో ఐశ్వర్యమునివ్వకపోతే వేదాన్ని, ధర్మాన్ని పాటించే వారు కరవై ధర్మ లుప్తమౌతుంది తల్లీ. లోకంలో ధర్మానికి ఆపద వచ్చినప్పుడు ధర్మాన్ని కాపాడే వాడు పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు అటువంటి శ్రీ మహా విష్ణువుకే స్ఫూర్తిని పుష్టిని ఇచ్చేదానవు నీవు, నీవు వీరికి ఐశ్వర్యమునిచ్చి వేదాన్ని ధర్మాన్ని నమ్మినవారికి ఆపదలు, ఇక్కట్లు లేకుండా చేయవలసిన దానవు నువ్వేకదాతల్లీ. అమ్మా కేవల ధనవృద్ధితోనే ఐశ్వర్యవంతులు కాలేరు కదాతల్లీ, ధన ధాన్య వృద్ధి అనుభవైకవేద్యమవ్వాలి ( మన్మథుడు కోరికకు రూపమైతే ఆయన పత్ని తల్లి రతీదేవి కోరిక అనుభవములోకి వచ్చినప్పటి అనుభూతి) సముద్రము ఎంత విశాలమో, ఎన్ని రత్నాలను అందులో దాచుకున్నదో అంత గొప్ప అనుభవైకవేద్యమైన అనుభూతులను ఇవ్వగలిగిన తల్లివి నువ్వు. తల్లీ వీరికి ఐశ్వర్యమునిచ్చి, పాపములను తీసి ఐశ్వర్యమును అనుభవైకవేద్యముగ చేయగల తల్లివి. అమ్మా అన్ని శక్తులకు మూలమైన శక్తివి నువ్వు నీకు అనుగ్రహాన్ని కురిపించుట అతి తేలికైన పని అమ్మా అంత గొప్ప తల్లివైన నీకు పునః పునః పునః ప్రణామాలు.