Wednesday, June 12, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-12

శ్రీ గురుభ్యోన్నమః
శ్లో11!! శ్రుత్యై నమో౭స్తు శుభకర్మ ఫల ప్రసూత్యై
రత్యై నమో౭స్తు రమణీయ గుణార్ణవాయై !
శక్త్యై నమో౭స్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో౭స్తు పురుషోత్తమ వల్లభాయై !!
తా : శుభములైన శ్రౌత, స్మార్త కర్మలకు సముచిత ఫలములనిచ్చువేదమాతృస్వరూపురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. ఆనందపఱచు గుణములకు సముద్రము వంటి విశాఅమగు రతీదేవి స్వరూపురాలైన మాతకు ప్రణామము. నూఱు దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తిస్వరూపురాలికి వందనము. విష్ణుమూర్తికి ప్రియురాలై పుష్టి నొసగు ఇందిరాదేవికి నమస్కారములు.

వివరణ: వేదరూపిణియై సకల శుభ ఫలములను ఇచ్చు వేదస్వరూపమైన తల్లికి నమస్కారము, వేదము సకల శుభ కర్మలకు శుభఫలములనిచ్చు స్వరూపము, శ్రౌత స్మార్త కర్మలను ఒనగూర్చువారికి సకల శుభ ఫలములనిచ్చునది. వేదము స్వరూపము ధర్మ స్వరూపమే కాబట్టి ధర్మవర్తనులకు శుభ కర్మ ఫలాలనిచ్చు శక్తికలైగిన శ్రుతి స్వరూపమైన తల్లికి నమస్కారము. నానా రత్నములను తన గర్భములో దాచుకొనిన విశాలమైన సముద్రవలె, రమణీయమైన గుణములకు సముద్రమువంటిదైన రతీదేవి (అనుభవపూర్వకమూ చేయు శక్తిగాఉన్నటువంటి తల్లి, మన్మథుడు= కోరిక; రతి=అనుభవములోనికి వచ్చుట) వంటి తల్లికి నమస్కారములు. నూరు దళములు కలిగిన పద్మములో నుండు అన్ని శక్తులకూ ఆధారభూతమైన శక్తికి నమస్కారము. పురుషోత్తముడైన శ్రీహరికి పుష్టిని స్ఫూర్తిని కలిగించు తల్లి శ్రీ లక్ష్మీ దేవికి నమస్కారము.
సందర్భం ప్రకారం: అమ్మా వేద స్వరూపమైన తల్లివి నీవే కదా, వేదము శుభ కర్మలకు శుభ ఫలములిచ్చును కదా, పైగా ఇంత దరిద్రములోనూ అధర్మ మార్గము పట్టక ఉంఛవృత్తితో జీవనము సాగిస్తూ స్వాధ్యాయం చేసుకుంటూ గడుపుతున్న కుటుంబం బ్రాహ్మణ కుటుంబం. వేదాన్ని, ధర్మాన్ని నమ్మి నలుగురికీ బోధ చేయవలసిన బ్రాహ్మణ కుటుంబానికే శుభ ఫలములతో ఐశ్వర్యమునివ్వకపోతే వేదాన్ని, ధర్మాన్ని పాటించే వారు కరవై ధర్మ లుప్తమౌతుంది తల్లీ. లోకంలో ధర్మానికి ఆపద వచ్చినప్పుడు ధర్మాన్ని కాపాడే వాడు పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు అటువంటి శ్రీ మహా విష్ణువుకే స్ఫూర్తిని పుష్టిని ఇచ్చేదానవు నీవు, నీవు వీరికి ఐశ్వర్యమునిచ్చి వేదాన్ని ధర్మాన్ని నమ్మినవారికి ఆపదలు, ఇక్కట్లు లేకుండా చేయవలసిన దానవు నువ్వేకదాతల్లీ. అమ్మా కేవల ధనవృద్ధితోనే ఐశ్వర్యవంతులు కాలేరు కదాతల్లీ, ధన ధాన్య వృద్ధి అనుభవైకవేద్యమవ్వాలి ( మన్మథుడు కోరికకు రూపమైతే ఆయన పత్ని తల్లి రతీదేవి కోరిక అనుభవములోకి వచ్చినప్పటి అనుభూతి) సముద్రము ఎంత విశాలమో, ఎన్ని రత్నాలను అందులో దాచుకున్నదో అంత గొప్ప అనుభవైకవేద్యమైన అనుభూతులను ఇవ్వగలిగిన తల్లివి నువ్వు. తల్లీ వీరికి ఐశ్వర్యమునిచ్చి, పాపములను తీసి ఐశ్వర్యమును అనుభవైకవేద్యముగ చేయగల తల్లివి. అమ్మా అన్ని శక్తులకు మూలమైన శక్తివి నువ్వు నీకు అనుగ్రహాన్ని కురిపించుట అతి తేలికైన పని అమ్మా అంత గొప్ప తల్లివైన నీకు పునః పునః పునః ప్రణామాలు.