Monday, May 13, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-10

శ్రీ గురుభ్యోనమః

 
శ్లో9!! ఇష్టాః విశిష్ట మతయో౭పి నరా యయా౭౭
దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభన్తే!
దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టామ్
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా: !!

తా : ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన పండితులు (జ్ఞానులు) తేలికగా స్వర్గధామమున సుఖించెదరో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో విలసిల్లు కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను ప్రసారించు గాక !
వివరణ: ఈస్తొత్రంలో బాల శంకరులు అమ్మవారిని లక్ష్మీ దేవిగానే కాక ముగురమ్మలుగా కీర్తిస్తున్నారు, ఎవరి చల్లని కంటి చూపువలన మానవులు వాంఛా ఫలత్వము, గొప్పనైన బుద్ధి మరియు జ్ఙానమును పొంది అంత్యమున స్వర్గాది లోకములను మోక్షమును పొందుతున్నారో చూపులకు కారణమైనటువంటి బాగుగా విప్పారినటువంటి కమలముల లాంటి అందమైన కళ్ళు కలిగిన ( బాగా విప్పారిన కమలము మధ్యలో చల్ల దనము, తడి బిందువులు ఉంటాయి, అంటే అమ్మవారి కన్నిలు బాగా విప్పారి భక్తుల ఆర్తి తీర్చడానికి తడి ఉన్న కన్నులు అని చెప్పటానికి ఉపమానం వేశారు శంకరులు), పద్మము పై విరాజిల్లిన లక్ష్మీదేవి యొక్క చల్లని కృపాదృష్టి మా అందరిపై వర్షించు గాక.
సందర్భం ప్రకారం: అమ్మా నువ్వు బీద బ్రాహ్మణ కుటుంబం ఆర్తిని తీర్చలేనిదానవుగాదు. నిన్ను ఆశ్రయించిన వారికి కేవలం ఐశ్వర్యమే కాదు సకల కోరికలు తీర్చగలవు, జ్ఙానమియ్యగలవు, స్వర్గాదులు మోక్షము ఇయ్యగలవు. అందుకు ఋజువు లోకంలో ఎందరో పండితులు నిన్ను స్తుతి చేయడమేగదా. అందరికీ అన్నీ ఈయగల నువ్వు బీద బ్రాహ్మణ కుటుంబానికి కలిగిన తాపాన్ని తీయడానికి నీ కృపాపూర్ణ దృక్కులు మాపై ప్రసరించెదవుగాక.

2 comments:

  1. నేనెందుకు మీ బ్లాగు ఎప్పుడూ చూడలేదు? అనిపించింది

    ReplyDelete
  2. మీకు స్వాగతం!
    ధన్యవాదాలండీ

    ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు

    ReplyDelete