ఈ క్రింది లంకె ద్వారా ముందటి భాగాన్ని చూడగలరు
శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-01
శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-01
శ్లో1!! అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ !
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: !!
తా : ఆడ తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా ఏ మంగళదేవత యొక్క ఓరచూపు నీలమేఘశ్యాముడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ వృక్షము తొడిగిన మొగ్గలవలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో, అష్టసిద్ధులను తన వశమునందుంచుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించును గాక !
వివరణ: శంకరులు ఇక్కడ ముందుగా విష్ణుభగవానుని నామాన్ని చెప్పి తల్లి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు చేసిన మొట్టమొదటి శ్లోకం ఇది. తల్లి నిత్యానపాయని కదా విష్ణువుని కీర్తిస్తే తాను ఎక్కువ సంతోషపడుతుంది. ఇందులో శంకరులు హరేః అన్న నామాన్ని ప్రస్తావించారు. వేరు నామాల్ని ఏవీ ప్రస్తావించలేదు. హరి అంటే సకల పాపాలను హరించేవాడు అని కదా అర్థం. ఒకవేళ బీద బ్రాహ్మణి పాపాలు ఎక్కువగా ఉంటే వాటిని తేలికగా తీసేయగలిగినవాడు శ్రీ హరి. అందుకు ఈ నామం వాడారు.
అలాగే తమాల వృక్షం అన్న పదాన్ని వాడారు. తమాల వృక్షాన్ని చీకటి చెట్టు అని అంటారు అది నల్లగా ఉంటుంది. ఊరి బయట సముద్రపుటొడ్డున స్మశానాలలో ఉంటుంది. అందరూ వదిలేసి వెళ్ళినా స్మశానంలో నేనున్నాని చెప్పి పాపపుణ్యాలకతీతంగా జీవునికి తోడుగా స్మశానంలో ఉండేది తమాల వృక్షం. మరి అలాంటి నీలమేఘ సంకాశుడైన విష్ణుభగవానుడు కూడా అంతేగా పాపపుణ్య ఫలప్రదాత/ పాపపుణ్యాలకతీతంగా జీవులని ఉద్దరించగలడు. అలాగే ఈ బీద బ్రాహ్మణ కుటుంబాన్ని కూడా పాపపుణ్యాలకతీతంగా ఉద్దరించగలడు. అంతటి గొప్ప కారుణ్యాన్ని వర్షించగల విష్ణుభగవానుడు నీ చూపులు తగిలేసరికి అతని శరీరము పులకాంకితమౌతుంది. తమాల వృక్షానికున్న బొడిపెలలాంటి మొగ్గలమీద ఆడ తుమ్మెద ఎలాతిరుగుతున్నదో అలా నీచూపులు కారుణ్యపూర్తమైన విష్ణుభగవానుని శరీరము మీద సోకేసరికి శ్రీహరికి పులకాంకురాలు కలిగి అవే ఆభరణాలుగా మారాయి.
నీచూపులను అంగీకరించిన విష్ణువుయొక్క మహదానందమునకు కారణమై అఖిల విభూతులకూ సకలైశ్వర్యములకూ పుట్టినిల్లువైన తల్లీ లక్ష్మీ దేవీ! ఆ చల్లని చూపులు ఒకసారి మావంక ప్రసరింపజేస్తే విష్ణు భగవానుడు అనునయంగా మా పాపాలను తొలగ తోస్తాడు, తద్వారా నీవు మాకు సమస్త మంగళములు కల్గించెదవుగాక !
సందర్భం ప్రకారం: తల్లీ! పాపాలెన్నో కలిగి పుణ్యరాశిలేని ఈ బీదబ్రాహ్మణ కుటుంబ పాపాలను తొలగతోయగలిగిన శక్తిఉన్న దంపతులు మీరు, ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పారణకై వేచి ఉన్నారంటే ఆ శ్రీ హరిని పూజించువారేకదా, దానిద్వారా వారి పాపాలను ధ్వంసం చేయడం మీకు సాధ్యమే. ఇక పుణ్యం విషయానికి వస్తే ఇదిగో ఇప్పుడే నాచేతిలో ఉసిరికాయ దానం చేసింది, ఆ కొంత పుణ్యాన్ని కొండంత పుణ్యంగా మార్చే కరుణామూర్తులు మీరు, అది అడ్డం పెట్టి ఈ బ్రాహ్మణ కుటుంబానికి సంపత్తిని కలుగజేసి దారిద్ర ధ్వంసనం చేసి ఉద్ధరించు.
..సశేషం..
No comments:
Post a Comment