Wednesday, April 3, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-08

ఈ లంకె ద్వారా ముందటి భాగాన్ని చూడగలరు
 
శ్లో7!!
ప్రాప్తమ్ పదమ్ ప్రథమత: ఖలు యత్ ప్రభావాత్
మాంగల్య భాజి మధుమర్దిని మన్మథేన !
మయ్యాపతేత్ తదిహ మంథర మీక్షణార్ధమ్
మందాలసం చ మకరాలయ కన్యకాయా: !!
తా : దేని ప్రభావముచేత మన్మథుఁడు సమస్త కల్యాణ గుణాభిరాముఁడైన శ్రీ విష్ణుమూర్తి యొక్క మనస్సునందు (ఆయనను మన్మథబాధకు గుఱిచేయుట ద్వారా) మొదటి సారిగా స్థానము సంపాదించుకొన్నాడో, ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక !

వివరణ: ఈ శ్లోకంలో కూడా శంకరులు మధుమర్దిని అన్న పదాన్ని విష్ణువుకు వాడారు, ఆంతరంగా అమ్మవారికీ ఈ పదాన్ని వాడారు. అలా ఎలా అంటే, మధు కైటభులను శ్రీహరి సంహరించినప్పుడు జగజ్జనని మధు కైటభులను మోహపరచడానికి (కామప్రదమైన) తన చూపులను మధుకైటభులపై ప్రసరింపజేయగా దానితో విర్రవీగిన ఆ రాక్షసులు విష్ణువుకే వరం ఇవ్వడానికి సిద్దపడగా విష్ణువు వారి చావునే వరంగా కోరాడు అలా ఆ తల్లి తన చూపులతో మొట్టమొదటి రాక్షస సంహారంగా తన చూపులతో విష్ణువును అనుగ్రహించి అందరికీ అన్నీ ఈయగల విష్ణువుకు మధుకైటభ సంహారం అనే కోరిక తీర్చినది. దీనిద్వారా మధుమర్దిని అన్న నామం శ్రీమహావిష్ణువుకు అమ్మవారికీ కూడా చెందుతుంది.

ఏ అమ్మవారి చూపుల ప్రభావంచేత మధుకైటభులు మోహాంధులై సంహరింపబడ్డారో, ఏ చూపుల వలన మధువనే రాక్షసుని చంపే మంగళకార్యం శ్రీహరి చేయగలిగెనో, అటువంటి చూపులు కలిగిన తల్లి లక్ష్మీ దేవి (ఇక్కడ లక్ష్మీదేవిని ఆదిశక్తిగా శంకరులు కొలుస్తున్నారు) విష్ణుభగవానుని హృదయమనే స్థానాన్ని అలంకరించినట్టి లక్ష్మీదేవి, నిర్హేతుకంగా మొసళ్ళు మొదలగు కౄర ప్రాణులు నివసించు సముద్రుని కరుణించి కూతురుగా పుట్టిన తల్లి లక్శ్మీదేవి తన నెమ్మదైన, కరుణాపూరితమైన నిమ్మీలిత నేత్ర దృష్టిని మాపై ప్రసారం చేయుగాక.

సందర్భం ప్రకారం: అమ్మా లక్ష్మీదేవీ, ఏ కారణముందని నీ కరుణతో తనలో ఎన్నో కౄరప్రాణులని ఉంచి పోషిస్తున్న సముద్రునికి కూతురువయ్యి లక్ష్మీదేవి తండ్రి అని సముద్రునికి కీర్తినిచ్చావు? అది నీ అపార దయ కారుణ్యం, అది నిర్హేతుకము. అలాగే అదే కారుణ్యముతోటి ఈ బీద బ్రాహ్మణ కుటుంబాన్ని ఉద్దరించవా. అమ్మా నీ మోహపు చూపుల ప్రభావంచేతనేకదా మధువనే రాక్షసుని వధ అనే మంగళ కార్యమును శ్రీమహావిష్ణువు నిర్వర్తించినాడు. ఒకేసారి నీ చూడ్కులు రాక్షసులు సంహరింపబడడానికి, శ్రీమహావిష్ణువు రాక్షస సంహారమనే మంగళకార్యముచేయడానికి హేతువులైనాయి కదా. మరి ఈ బీద బ్రాహ్మణ కుటుంబానికి ఏ హేతువులేక ఐశ్వర్యాన్ని ఇవ్వలేకపోతే, నీచూపులను ప్రసరింప జేసి అవే హేతువులుగా చూపి ఐశ్వర్యాన్ని కటాక్షించు తల్లీ. అందరికోర్కెలు తీర్చే విష్ణుభగవానుని కోర్కెలే తీర్చగలిగిన నీచూపులు దరిద్రులైన వీరిని ఉద్దరించగలవు. కాబట్టి నీ కరుణాపూరితమైన చూపులను మాపైన వర్షింపజేయి.

Thursday, March 14, 2013

మీనాక్షీ పంచరత్నం



మీనాక్షీ పఞ్చరత్నమ్

ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం
బిమ్బోష్ఠీం స్మితదన్తపంక్తిరుచిరాం పీతామ్బరాలఙ్కృతామ్!
విష్ణుబ్రహ్మసురేన్ద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతొఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్!!౧!!
ఉదయించుచున్న వేలకోట్ల సూర్యులతో సమానమైనది, కంకణములతో, హారములతో ప్రకాశించుచున్నది, దొండపండ్లు వంటి పెదవులు కలది, చిరునవ్వు లొలుకుదంతముల కాంతి కలది, పీతాంబరములను ధరించినది, విష్ణు- బ్రహ్మ- దేవేంద్రులచే సేవించబడునది. తత్త్వస్వరూపిణియైనది, శుభము కల్గించునది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేన్దువక్త్రప్రభాం
శిఞ్జన్నూపురకిఙ్కిణీమణిధరాం పద్మప్రభాభాసురామ్|
సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్!!౨!!
ముత్యాలహారాలు అలంకరించిన కిరీటముతో శోభించుచున్నది, నిండు చంద్రుని వంటి ముఖకాంతి కలది, ఘల్లుమంటున్న అందెలు ధరించినది, పద్మములవంటి సౌందర్యము కలది, కోరికలనన్నిటినీ తీర్చునది, హిమవంతుని కుమార్తెయైనది, సరస్వతి- లక్ష్మీదేవులచే సేవించబడుచున్నది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీకారమన్త్రోజ్జ్వలాం
శ్రీచక్రాఙ్కిత బిన్దుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్!
శ్రీమత్షణ్ముఖవిష్ణురాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్!!౩!!
శ్రీ విద్యాస్వరూపిణి, శివుని ఎడమభాగమునందు నివసించునది, హ్రీంకార మంత్రముతో ఉజ్జ్వలమైన్నది, శ్రీచక్రములోని బిందువు మధ్య నివసించునది, ఈశ్వర్యవంతమైన సభకు అధిదేవతయైనది, కుమారస్వామి- వినాయకులకు కన్నతల్లియైనది, జగన్మోహినియైనది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
శ్రీమత్సున్దరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్!
వీణావేణుమృదఙ్గవాద్యరసికాం నానావిధాడమ్బికాం
మీనాక్షీం ప్రణతొఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్!!౪!!
సుందరేశ్వరుని భార్యయైనది, భయము తొలగింపచేయునది, జ్ఞానము నిచ్చునది, నిర్మలమైనది, నల్లని కాంతి కలది, బ్రహ్మదేవునిచే ఆరాధించబడునది, నారాయణుని సోదరియైనది, వీణ- వేణు- మృదంగవాద్యములను ఆస్వాదించునది, నానావిదములైన ఆడంబరములు కలది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
నానాయోగిమునీన్ద్రహృన్నివసతిం నానార్థసిద్ధప్రదాం
నానాపుష్పవిరాజితాఙ్ఘ్రియుగళాం నారాయణేనార్చితామ్!
నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్త్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్!!౫!!
అనేక యోగుల- మునీశ్వరుల హృయములందు నివశించునది, అనేకకార్యములను సిద్దింపచేయునది, బహువిధ పుష్పములతో అలంకరింపబడిన రెండుపాదములు కలది, నారాయణునిచే పూజింపబడునది, నాదబ్రహ్మస్వరూపిణియైనది, శ్రేష్ఠమైనదాని కంటే శ్రేష్ఠమైనది, అనేక పదార్థముల తత్త్వమైనది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
!!ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ మీనాక్షీ పఞ్చరత్నం సమ్పూర్ణమ్!!

జయ జయ శఙ్కర హర హర శఙ్కర

source: kamakoti.org