Monday, February 18, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-05

ఈ క్రింది లంకె ద్వారా ముందటి భాగాన్ని చూడగలరు

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-04  


శ్లో4!! ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ద
మానన్దకన్ద మనిమేష మనఙ్గతన్త్రమ్ !
ఆకేకర స్థిర కనినీక పద్మనేత్రం
భూత్యైభవేన్మమ భుజఙ్గశయాఙ్గనాయాః !!

తా:ఆమ్మా లక్ష్మీదేవీ! ఎప్పుడూ ఆనందమునిస్తూ కొద్ది కొద్దిగా తెరచియున్న కన్నులున్నవాడు, మన్మథుని తంత్రమును వశము చేసుకొనినవాడు, ఆదిశేషునిపై శయనించువాడు ఐన మహావిష్ణువు యొక్క పత్నివి నీవు. అర్థనిమ్మీలిత నేత్రాలతో స్థిరమైన చూపులతో పద్మము వంటి కనులతో శ్రీ మహావిష్ణువును చూచే చూడ్కులున్న తల్లీ మీ కళ్యాణ రూపము నాకు కళ్యాణ రూపము నాకు కళ్యాణమును కలిగించు గాక.

వివరణ: ఇక్కడ శంకరులు ముకున్ద అన్న పదంతో శ్రీ మహావిష్ణువుని సంబోధించారు. ముకున్ద అన్న పదానికి మోక్షమునిచ్చువాడు అని అర్థము. సంసార బాధలు లేక కేవలము మోక్షమును కోరే వారు ఆశ్రయించు వాడు శ్రీ మహావిష్ణువు. తాను ఎల్లప్పుడూ అర్థ నిమ్మీలిత నేత్రాలతో తన భక్తులను రక్షిస్తూ వారికి ఆనందము కలిగించేవాడు శ్రీ మహావిష్ణువు. ఐతే శ్రీ మహావిష్ణువు మన్మథుని తంత్రాన్ని వశము చేసుకున్నవాడు అని శ్లోకంలో చెప్పారు, అసలు మన్మథుడు ఆయన కొడుకే కదా, మన్మథునికి ఉన్న శక్తికి కూడా కారణం విష్ణువే. ఇక ఆయన భుజగశయనుడు, పాము మీద పడుక్కుంటాడు. రెంటి అర్థం ఏమంటే జనన మరణాలకై అతీతంగా మోక్షాన్ని ఇవ్వగలిగినవాడు. మన్మథుడు పుట్టుకకు కారకుడు, మన్మథ బాణం తగిలితేనేకదా జీవుల జననం సంభవిస్తుంది. పాము మృత్యువునకు సంకేతం, పాము కాటు వేసిందంటే మృత్యువు గ్రసించినట్టు అని అర్థం. మరి శ్రీ మహావిష్ణువో, అందరి పుట్టుకకీ కారణమౌతున్న మన్మథుణ్ణే కన్నవాడు, మృత్యువును తన తల్పంగా కలిగినవాడు, అంటే తన అవసరానికి ఆసనంగా, తల్పంగా వాడుకునేవాడు. అంటే రెంటికి అతీతుడు. మరి మోక్షాన్ని ఇచ్చి కామాన్ని, మరణాన్ని శాసించగలవాడు అలాగే తన భక్తులనీ కాపాడుకో గలిగినవాడు. (ఇక్కడ శ్రీ హరిని పరబ్రహ్మ తత్త్వంగా సృష్టి, స్థితి, లయలను ఆధీనములో కలవానిగా కీర్తించారు శంకరులు) అటువంటి శ్రీహరిని పద్మములవంటి తన కళ్ళతో కనుపాప కదలకుండా స్థిరమైన చూపులతో సగము మూసిన కనులతో చూచి మన్మథ తన్త్రాన్నే వశము చేసుకున్న శ్రీ మహావీష్ణువుకు ఆనందము కలిగించు చూపులున్న తల్లీ మీ కళ్యాణ కారకమైన చూపులు మాకు కూడా కళ్యాణమును కలిగించు గాక! అని ప్రార్థించారు.

సందర్భం ప్రకారం: అమ్మా లక్ష్మీ దేవీ! పేద బ్రాహ్మణ కుటుంబానికి ఏపుణ్యమూ లేదు అని కాదా నీవు ఐశ్వర్యమివ్వడానికి కుదరదన్నావు. సరే, నువ్వు స్వయంగా జనన మరణాలకు అతీతంగా ఉండి తన భక్తులను రక్షించే శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలివి. వీరేమో ఏకాదశీ వ్రతం చేసి ద్వాదశి పారణ విధిగా చేస్తున్నవారు. మరి శ్రీ మహావిష్ణువు తన భక్తులు రక్షించే గుణమున్నవాడు. ఆయనకి ఎప్పుడూ ఆనందం కలిగించేదానవు నువ్వు, మన్మథుని పుట్టించిన ఆయనకే ఆనందం కలిగించే నీ చూపులు, ఒక్క సారి బీద బ్రాహ్మణ కుటుంబం మీద పడితే దాని వల్ల వారు ఉద్దరింపబడితే, శ్రీ మహావిష్ణువు నీ చూపుల ద్వారా తన భక్తులు ఉద్ధరింపబడ్డారని ఇంకా ఆనందం పొందగలడు. తల్లీ మీ చల్లని కళ్యాణ కారకమైన చూపులచే మాకందరికీ కళ్యాణమగు గాక!

Friday, February 15, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-04

ఈ క్రింది లంకె ద్వారా ముందటి భాగాన్ని చూడగలరుశ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-03

విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్ష
మానంద హేతురధికం మురవిద్విషోపి !
ఈషన్నిషీదతుమయి క్షణమీక్షణార్థ
మిన్దీవరోదర సహోదర మిన్దిరాయాః!! 3
తా: ఇంద్రాది దేవతలకు ముల్లోకములను అమరావతిని కట్టబెట్టగలిగిన దయతో కూడిన విష్ణుభగవానుని ఆనందమును వృద్ధిచేయు చూపులు కలిగిన తల్లీ, చతుర్ముఖ బ్రహ్మకి సోదరీ ! ఒక్క క్షణము నీ కరుణాపూరిత చూడ్కులు మాపై ప్రసారముచేయుదువుగాక!
వివరణ: ఇక్కడ కూడా విష్ణుమూర్తిని పరోక్షంగా మురారి అని, మురవిద్విషోపి అన్న పద ప్రయోగం ద్వారా సంబోధించారు శంకరులు. దానము చేయకుండా తనదిగా అన్నీ దాచుకున్నవానికి శత్రువైన శ్రీమహావిష్ణువు, దేవాంద్రాదులకు స్వర్గాది లోకములను తన దయతో దానమిచ్చాడు. ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని చూస్తే. ఒకానొకనాడు దుర్వాసో మహర్షి అమ్మవారిచ్చిన పుష్పహారాన్ని చేత బట్టుకుని వెళ్తూండగా దేవేంద్రుడు ఐరావతం మీద ఎదురైనప్పుడు దేవేంద్రునికి మంగళం చెప్పి ఆశీర్వదించి దుర్వాసో మహాముని ఇంద్రునికి అమ్మవారిచ్చిన పుష్పహారాన్ని ఇచ్చారు. తరవాత అహంకారంతో ఉన్న దేవేంద్రుడు హారాన్ని ఐరావతం మీదకి విసిరి వెళ్ళిపోయాడు. తద్దోషంగా లక్ష్మీ దేవి పాల సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇంద్రుని అహంకారం వల్ల లక్ష్మీ దేవి దేవలోకాన్నే కాక వైకుంఠాన్ని కూడా వదిలి పాల సముద్రంలో చేరిపోయింది. తరవాత ఇంద్రుడు అన్ని బాధలు పడ్డాడు, తరవాత క్షీర సాగర మథనం జరిగి లక్ష్మీ దేవి పైకి వచ్చి శ్రీ మహావిష్ణువుని మళ్ళీ చేరింది(ప్రకటంగా చేరింది, వారిద్దరూ విడివడినదెన్నడు గనక?). అటువంటి అహంకారి, నీ ప్రసాదమైన పుష్పమాలనే తిరస్కరించినవాడు రాజ్య భ్రష్టుడౌతే, స్వయంగా శ్రీ మహావిష్ణువే ఇంద్రునికి తమ్ముడుగా, పన్నెండు నెలలు గర్భవాసం చేసి వామనావతారమెత్తి, ఇంద్రునికి తమ్ముడు కనుక ఉపేంద్రుడను పేరు పెట్టుకుని, ఒకరికి ఇవ్వడమే ఎరిగిన శ్రీహరి, బలి చక్రవర్తి వద్ద చేయిచాచి దానమడిగి మూడులోకాలనూ కొలిచి బలిని పాతాళానికి త్రొక్కి అలా దానంగా సంపాదించిన రాజ్యాన్ని ఇంద్రునికిచ్చాడు. అటువంటి విష్ణుమూర్తి గుండెలలో ఉండేదానివి నీవు. నీ చల్లని చూపులతో అంత దయగలిగిన విష్ణుమూర్తికే ఎంతో ఆనందాన్ని కలిగించేదానవు. విష్ణు మూర్తి నల్లని కలువ పువ్వైతే అందులోని సౌకుమార్యం అంతా ఆయన దయ. దాని మధ్యలోనున్న దుద్దు అతి సుకుమారం మధ్య భాగం ప్రకాశవంతం ఇంకా చల్లన. చల్లని నల్లని విష్ణుమూర్తి అనే కలువ పువ్వుగుండెలోని అత్యంత సౌకుమార్యమైన అత్యంత చల్లనైన మధ్య భాగం వంటి మా అమ్మ దానవు లక్ష్మీదేవివినువ్వు. పువ్వుకన్నా మధ్యభాగంలోనే ఆర్ద్రత, చల్లదనం ఎక్కువ... మరి చల్లని చూడ్కులు మాపై ప్రసారం చేసి మమ్మల్ని రక్షించవా తల్లీ!
సందర్భం ప్రకారం: క్రిందటి శ్లోకంలో చేప్పినట్లు దానం చేయనివారికి శత్రువైన విష్ణుమూర్తి (మురారి), స్వయంగా తానే ఇంద్రునికోసం దానం పట్టి, తద్వారా వచ్చిన దాన్ని ఇంద్రునికి దానమిచ్చేశాడు. శ్రీ హరిగా పాపాలను తీయగలడు కానీ దారిద్రాన్ని తీసి పుణ్యఫలంగా ఐశ్వర్యాన్ని ఇవ్వగల అన్నదానికి ఉదాహరణగా పైన చెప్పిన దుర్వాసో మహర్షి, అమ్మవారిచ్చిన పూమాల, ఇంద్రుడు, క్షీరసాగర మథనం, వామన, బలి చక్రవర్తి కథ మొదలైనవి సూచించారు. అంటే భగవంతుని పట్ల , భాగవతుల పట్ల చేసిన తప్పునే దిద్ది తిరిగి ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని ఇవ్వగల దయ కలిగిన హృదయం కలిగినవాడు శ్రీ మహావిష్ణువు. చల్లని విష్ణువు గుండెలలో ఇంకా చల్లగా ఉన్న తల్లివి నువ్వు, ఎంతో దయగల మీ ఇద్దరూ, బ్రాహ్మణ కుటుంబం యొక్క పాపాలను తీసి వీరిని ఉద్దరించి ఐశ్వర్యాన్ని కలుగచేయవలసినది అని శంకరులు ప్రార్థించారు.

..సశేషం...