Wednesday, May 15, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-11

శ్రీ గురుభ్యోన్నమః

శ్లో10!! గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి !
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితా యా
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై !!

తా: విష్ణుమూర్తికి భార్యయైన లక్ష్మిగా, బ్రహ్మదేవుని పత్నియైన సరస్వతిగా, సదాశివుని అర్ధాంగియైన అపరాజితగా, శాకంభరీదేవిగా - ఇట్లనేక రూపములతో ఏ విశ్వమాత సృష్టి, స్థితి, ప్రళయ లీలను సాగించుచున్నదో, ఆ విశ్వాత్మకుడైన పరమ పురుషుని ఏకైక ప్రియురాలికి నమోన్నమహ.

వివరణ: శంకరులు ఇక్కడ అమ్మవారిని పరబ్రహ్మమహిషిగా సాక్షాత్ జగదంబ సృష్టి స్థితి లయ కారకురాలిగా, లోకాలను పోషించే తల్లిగా కీర్తించారు. సృష్టి కర్త ఐన బ్రహ్మ గారి సృష్టించే శక్తిగా ఉన్న సరస్వతిగా, స్థితికారకుడైన విష్ణుమూర్తియొక్క రక్షించే శక్తి ఐన లక్ష్మీదేవిగా, లయ కారకుడైన చంద్ర శేఖరుని యొక్క లయ కారక శక్తి ఐన పార్వతిగా ఉన్న ముగురమ్మల మూలశక్తివి నీవు. నీకు అసాధ్యమైనది ఏదీలేదుకదమ్మా!, సృష్టి స్థితి ప్రళయాలనే ఆటలను చక్కగా నిర్వర్తించే శక్తిగా త్రిమూర్తులను ఆశ్రయించి ఉన్న తల్లివి నీవు. అమ్మా ఒకానొకనాడు క్షామం వచ్చి జనులకి తినడానికి తిండిలేక లోకాలు నీరసించిపోతే, వారి బాధలు చూసి తట్టుకోలేక శతాక్షి గా వచ్చి జనుల కష్టాలు చూసి శతాక్షి రూపంతో ఆర్ద్రత నిండిన కన్నులతో కరుణా పూరితమైన చూడ్కులతో కాపాడావు. వెంటనే ఎవరైనా అడిగారా, తపస్సు చేశారా పాప పుణ్య ఫలితాలేమిటి అని ఆలోచించక ఆకలిని తీర్చడానికి సమస్త ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు రూపంగా శాకంబరీ అన్న పేర వచ్చి జనులందరికీ అప్పటికప్పుడు తినడానికి కావలసిన పదార్థాలను సమకూర్చావు. అది కేవలం నీ మాతృత్వభావన వల్లనే కదమ్మా. నువ్వు అన్ని జగాలకీ తల్లివి కనకనే ఎవరూ అడగకపోయినా అందరికీ అమ్మగా అన్నీ ఇచ్చావు. తల్లీ! అటువంటి నీకు ముల్లోకములకూ గురుస్వరూపమైన వాని పత్నివైన నీకు ఏమి ఇవ్వగలమమ్మా! కేవలం నమస్కారము తప్ప.

సందర్భం ప్రకారం: అమ్మా నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు నిర్వర్తించే సృష్టి, స్థితి, ప్రళయం అనే ఆటలకు మూల శక్తివి నువ్వే కదా. అటువంటి దానవు ఈ బీద బ్రాహ్మణ కుటుంబానికి వారి పాపాలను హరించి, వారు నాకు ఇచ్చిన ఈ ఉసిరిక దానాన్నే గొప్ప పుణ్యంగా మలిచి వారికి కావలసిన ఐశ్వర్యాన్ని ఇవ్వలేవా తల్లీ! అమ్మా ఎవరూ అడగకపోయినా, లోకంలో జనులందరూ కరువు కాటకాలకు గురియై ఉండగా శరీరమంతా కళ్ళు చేసుకుని ప్రాణుల కష్టాలకు చలించి నీ వంటినిండా ఉన్న కళ్ళలోని ఆర్ద్రతతో ముల్లోకాల కష్టాలనూ తీర్చడానికి శాకంబరిగా అవతరించి అందరి ఆర్తినీ ఆకలినీ తీర్చావు కదా తల్లీ! మరి ఈ బీద బ్రాహ్మణ కుటుంబం అప్పుడు లోకానికి కలిగిన కష్టం వంటి కష్టంలోనే ఉన్నారు. అప్పుడు ఎవరు స్తుతించారు ఎవరు స్తుతి చేయలే, ఎవరికెంత పాపముంది, ఎవరికెంత పుణ్యముంది అని చూడకుండా నీ నిండైన అమ్మతనంతోనే కదమ్మా లోకాలని కాపాడావు. మరి ఈ బీద బ్రాహ్మణ కుటుంబం ఏం చేసిందమ్మా! వారిని కూడా నువ్వు అనుగ్రహించవచ్చు కదాతల్లీ. అమ్మా గురుపత్ని ఎప్పుడూ శిష్యుడు యోగ్యుడా అయోగ్యుడా బాగా చదివే వాడా లేదా ఐశ్వర్యవంతుడా లేదా అని చూడదు కదా! అందరు శిష్యుల మీదా స్వపుత్రులలా మమకారంతో ఉంటుంది కదా! అమ్మా మరి నువ్వూ లోకానికే గురువైన వాని పత్నివి మరి ఎందుకమ్మా ఈ బ్రాహ్మణ కుటుంబాన్ని ఉద్దరించడంలో ఆలస్యం చేస్తున్నావు.?

Tuesday, May 14, 2013

శంకర సందేశం

శ్రీ గురుభ్యోనమః

హర హర శంకర - జయ జయ శంకర

శంకర జయంతి పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.!


మనందరికీ తర తరాలకీ ఆది శంకరులిచ్చిన సందేశం, శంకర జయంతి సందర్భంగా...

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతి స్త్యజ్యతామ్ !
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసంధీయతాం
ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ !! ౧
ప్రతిదినము వేదాధ్యయనం చేయుము. అందులో చెప్పబడిన కర్మలను అనుష్ఠించుము. ఈ కర్మాచరణమే ఈశ్వర పూజ అగు గాక, కామ్యముతో కర్మలను చేయుటను త్యజించుము. పాపములను పోగొట్టుకొనుము. సంసార సుఖములను (నిత్య అనిత్యాది విషయ సుఖములు) అనుసంధానించి పరిశీలించుము ఆత్మజ్ఞానము పొందడంలో కోరికను పెమ్చుకొనుము. గృహ  నుండి అతి శీఘ్రముగా బయటికి వెళ్ళుము (శీఘ్రముగా శరీరభ్రాంతి నుండి దూరము అవ్వడానికి ప్రయత్నించుము).

సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం
శాన్త్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ !
సద్‍విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతామ్ !! ౨
సత్సాంగత్యమును నెరపుము, సజ్జనులతోటి కలిసి మెలసి ఉండుము. భగవంతునిపై దృఢమైన భక్తిని కలిగి ఉండుము. శాంతి మొదలగు గుణములను ఆర్జించుము, కామ్య కర్మలను వర్జింపుము. సద్విద్వాంసులను, సద్గురువులను ఆశ్రయింపుము, వారి పాదుకలను ప్రతిదినమూ సేవింపుము . బ్రహ్మప్రాప్తికి తోడ్పడు ఏకాక్షర బ్రహ్మమంత్రమగు ఓంకారమంత్రమును అర్థించుము. శ్రుతుల శిరస్సులగు (వేదాంతములు) ఉపనిషత్తుల వాక్యములను వినుము.

వాక్యార్థ్యశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసన్థీయతామ్ !
బ్రహ్మైవాస్మి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహేఽహం మతిరుజ్‍ ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ !! ౩
తత్త్వమస్యాది మహా వాక్యములను అర్థం చేసుకొనుటకు ప్రయత్నింపుము  (విచారణ చేయుము), శ్రుతిశిరస్సులైన వేదాంత పక్షాన్ని పొందుము/ఆశ్రయింపుము. కుతర్కము వీడుము.  శ్రుతి సమ్మతమగు తర్కమునే గ్రహించతగినది. ’నేను బ్రహ్మమును’ అని ప్రతిదినము భావింపుము. గర్వాహంకారములను వీడుము. శరీరమున ’అహం’-’నేను’ అను బుద్దిని వీడుము. బుధజనులు/పండితులతో అనవసర వాదు పరిత్యజించుము.
క్షుద్‍వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతామ్ !
శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతాం
ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతామ్ !! ౪
ఆకలిదప్పులను వ్యాధికి చికిత్స చేయుము, ప్రతిదినము భిక్షాన్నమను ఔషధము సేవింపుము. రుచికరములగు భోజన పదార్థములను యాచింపక, విధివశమున లభించినదానితో తృప్తిని పొందుము. శీతోష్ణాది ద్వంద్వములను తితిక్షాబుద్ధితో సహింపుము. వ్యర్థముగా వాక్యములను మాట్లాడకుము. ఉదాసీనతను వహింపుము (ప్రతి దానికీ కదిలిపోకుండా ఉండే గుణాన్ని అలవర్చుకొనుము) , లోకుల యెడ నిష్ఠూరుడవు కాబోకు.

ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్ !
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధస్త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ !! ౫
ఏకాంతం ప్రదేశంలో సుఖముగ కూర్చుండుము. పరబ్రహ్మతత్త్వమునకై చిత్తమున సమాధాన పరచుము. ఈ జగత్తును పూర్ణబ్రహ్మముగా జూచుచు, అది విలీనమైనట్లు భావింపుము. జ్ఞానమునాశ్రయించి రాబోవు కర్మలయందు ఆసక్తుడవు కాకుండుము, ప్రారబ్ధను (భోగమును, దుఃఖమును) అనుభవించుచు, బ్రహ్మముయందే నిలచి ఉండుము (పరబ్రహ్మస్థితియందే నిమచు ఉండుము).

ఫలశ్రుతి
యఃశ్లోక పఞ్చకమిదం పఠతే మనుష్యః
సఞ్చిన్తయత్యనుదినం స్థిరతాముపేత్య !
తస్యాశు సంసృతిదవానలతీవ్రఘోర
తాపః ప్రశాన్తిముపయాతిచితి ప్రసాదాత్ !!
ఇతి శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాద విరచిత సాధన పఞ్చకమ్
ఏ మానవుడు ప్రతిదినమూ ఈ శ్లోక పంచకమును పఠించుచు స్థిరచిత్తముతో భావార్థమును చింతించుచుండునో, అతడు శీఘ్రముగానే సంసృతి- తీవ్ర దావానల - తీవ్ర ఘోర - తాపమును, చైత్యన్య స్వరూపుడైన ఈశ్వరప్రసాదమున పోగొట్టుకొనును.

ఇది పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య కృత సాధనా పఞ్చకము

సర్వం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యస్వామి చరణారవిందార్పణమస్తు

-శంకర కింకర:

అద్వైతం సత్యం - వేదం ప్రమాణం
ధర్మస్యజయోస్తు - అధర్మస్య నాశోస్తు
  
ప్రారబ్దవశాత్ మరో జన్మ వస్తే, ఎన్ని జన్మలెత్తినా! ప్రతీ జన్మకీ, జన్మ జన్మలకీ
శంకరులే గురువులు, చంద్రశేఖరుడే దైవము, వేదమే నా ధర్మము, భరత ఖండమే నా దేశము,
శంకరులే గురువులు, చంద్రశేఖరుడే దైవము, వేదమే నా ధర్మము, భరత ఖండమే నా దేశము,
శంకరులే గురువులు, చంద్రశేఖరుడే దైవము, వేదమే నా ధర్మము, భరత ఖండమే నా దేశము,

సత్యం సత్యం పునఃసత్యం