Monday, May 13, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-10

శ్రీ గురుభ్యోనమః

 
శ్లో9!! ఇష్టాః విశిష్ట మతయో౭పి నరా యయా౭౭
దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభన్తే!
దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టామ్
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా: !!

తా : ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన పండితులు (జ్ఞానులు) తేలికగా స్వర్గధామమున సుఖించెదరో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను ప్రసారించు గాక !
వివరణ: ఈస్తొత్రంలో బాల శంకరులు అమ్మవారిని లక్ష్మీ దేవిగానే కాక ముగురమ్మలుగా కీర్తిస్తున్నారు, ఎవరి చల్లని కంటి చూపువలన మానవులు వాంఛా ఫలత్వము, గొప్పనైన బుద్ధి మరియు జ్ఙానమును పొంది అంత్యమున స్వర్గాది లోకములను మోక్షమును పొందుతున్నారో ఆ చూపులకు కారణమైనటువంటి బాగుగా విప్పారినటువంటి కమలముల లాంటి అందమైన కళ్ళు కలిగిన ( బాగా విప్పారిన కమలము మధ్యలో చల్ల దనము, తడి బిందువులు ఉంటాయి, అంటే అమ్మవారి కన్నిలు బాగా విప్పారి భక్తుల ఆర్తి తీర్చడానికి తడి ఉన్న కన్నులు అని చెప్పటానికి ఈ ఉపమానం వేశారు శంకరులు), పద్మము పై విరాజిల్లిన లక్ష్మీదేవి యొక్క ఆ చల్లని కృపాదృష్టి మా అందరిపై వర్షించు గాక.
సందర్భం ప్రకారం: అమ్మా నువ్వు ఈ బీద బ్రాహ్మణ కుటుంబం ఆర్తిని తీర్చలేనిదానవుగాదు. నిన్ను ఆశ్రయించిన వారికి కేవలం ఐశ్వర్యమే కాదు సకల కోరికలు తీర్చగలవు, జ్ఙానమియ్యగలవు, స్వర్గాదులు మోక్షము ఇయ్యగలవు. అందుకు ఋజువు లోకంలో ఎందరో పండితులు నిన్ను స్తుతి చేయడమేగదా. అందరికీ అన్నీ ఈయగల నువ్వు ఈ బీద బ్రాహ్మణ కుటుంబానికి కలిగిన తాపాన్ని తీయడానికి నీ కృపాపూర్ణ దృక్కులు మాపై ప్రసరించెదవుగాక.

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-09


శ్లో8!! దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే !
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహ: !!
తా : లక్ష్మీదేవి యొక్క నీలమేఘముల వంటి నల్లని కనులు, ఈ దరిద్రుఁడనెడి విచారగ్రస్త పక్షి పిల్లపై దయ అనెడి చల్లని గాలితో కూడుకొని వీచి, ఈ దారిద్ర్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను శాశ్వతముగా, దూరముగా తొలగద్రోసి, నా మీద ధనమనెడి వానసోనలను ధారాళముగా కురియించు గాక ! విశేషార్థము : "అకించన" అన్న పదానికి 'దరిద్రుడు' అని, 'పాపములు లేనివాడు' అని రెండర్థాలు.

వివరణ : ఇక్కడ శ్రీ హరిని నారాయణ అన్న నామంతో అమ్మవారిని నారాయణ ప్రణయినీ అన్న నామంతో సంబోధించారు శంకరులు. నారాయణ అన్న పదానికి నీటికయ్య లేదా పుష్కలమైన నీరుఉన్న ప్రదేశము ఇల్లుగా కలవాడు అని అర్థము కూడా ఉన్నది. (సమస్త జీవజాలమూ విశ్రాంతి తీసుకొను ప్రదేశము అన్న అర్థముకూడా ఉన్నది) నీరు ఎక్కువగా కావలసినది బాగా తాపము, దాహమున్నవారికి. ఆ నీటినే ఇల్లుగా చేసుకున్నవాడు విష్ణుభగవానుడు. మరినువ్వో ఆ విష్ణుభగవానుని పత్నివి. నీకన్నులనిండా కారుణ్యము ఆర్ద్రత అనే నీటిమేఘాన్ని కలిగి ఉన్నదానివి. అమ్మా మేఘాలు ఏంచేస్తాయమ్మా, భరింపరాని గ్రీష్మతాపాన్ని పోగొడతాయి. అమ్మా గ్రీష్మ తాపంతో అల్లాడుతున్న పక్షిపిల్లకు కలిగే వేడిని దయ అనే చూపులతో తొలగతోసి, విషాదంలో మునిగిఉన్న ఈ పక్షికి నీ కన్నులనిండా నల్లగా ఉన్న మేఘమనే కరుణార్ద్ర చూపులను ప్రసరించి కారుణ్యాన్ని వర్షించి తాపాన్ని తీర్చమ్మా.

సందర్భం ప్రకారం : విహంగ శిశౌ అనే అర్థంతో పక్షిపిల్ల అన్న అర్థంతోపాటు, బ్రాహ్మణులు అన్న అర్థం కూడా వస్తుంది. పక్షి గుడ్డుగా ఒకసారి పిల్లగా ఒకసారి జన్మిస్తుంది కాబట్టి ద్విజ అని అంటారు. అలానే బ్రాహ్మణులకి కూడా ఉపనయనం అయ్యినతరవాత ద్విజ అని సంబోధిస్తారు. కాబట్టి విహంగ శిశౌ అని అన్నప్పుడు ఈ బ్రాహ్మణులకి అన్న అర్థం కూడా అన్వయమౌతుంది. తాపంతో ఉన్నవారికి నీరిస్తే సరిపోతుంది కదా మళ్ళీ దయ అనే చూపులతో వేడిని తీయడమెందుకు? అంటే ఇప్పుడు తాపం తొలగుతుంది మళ్ళీవేడి పుట్టినప్పుడు మళ్ళీ తాపం పుడుతుంది. అమ్మా ఇప్పుడు వీరికి కావలసిన ఐశ్వర్యమే కాదు, ఇప్పటిదాకా ఐశ్వర్యంపొందకుండా అడ్డుగా ఉన్న పాపాలని నీవు దయతో తొలగతోయలేదా, నువ్వు కేవలం ఐశ్వర్యమిచ్చినా వారి పూర్వ పాపం మిగిలిపోతే, దాని వల్ల అది భ్రష్టమౌతుంది. కాబట్టి తల్లీ వారి పూర్వజన్మ పాపాలని తీసి కురియడానికి సిద్దంగా ఉన్న నీకళ్ళనే మేఘాలని వారిపై వర్షించు. మరి పాపాలంటే తీస్తాను కాని ఇవ్వడానికి పుణ్యమేదీ అని అంటావేమో! ఇదిగో నాకు దానం చేసిన ఉసిరికాయ ఇంకా నాచేతిలోనే ఉంది అదేసాక్ష్యం. దయ అనేసముద్రాన్ని ఇల్లుగా చేసుకున్నవాడు నారాయణుడు, అతని పత్నివైన నీవో ఆ దయనే కళ్ళల్లో, కారుణ్యాన్నే చూపుల్లో పెట్టుకున్నదానివి నువ్వు. మీ చల్లని చూపులు మాదారిద్రమనే తాపాన్ని, పూర్వజన్మపాపాలను పోగొట్టుగాక.